ఢిల్లీలో "పిల్" వెబ్ సిరీస్ తరహా ఘటన.. తెరపైకి సంచలన విషయాలు!
అవును... దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ క్యాన్సర్ మందులు వాడిన ఎనిమిది మంది రోగులను పోలీసులు గుర్తించారు. దీంతో... ఒక ఆందోళన కలిగించే స్కామ్ వెలుగులోకి వచ్చింది.
రితేష్ దేశ్ ముఖ్ నటించిన తాజా వెబ్ సిరీస్ "పిల్" లో షుగర్ వ్యాదికి సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి తప్పుడు మార్గంలో అప్రూవల్ పొందిన ఓ మెడిసిన్ దేశంలో ఎలాంటి అలజడి సృష్టించింది, అమాయకుల ప్రాణాలు ఎలా తీసింది అనేది స్పష్టంగా చూపించారు. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఇది తీవ్ర ఆందోళనకరంగా ఉంది!
అవును... దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ క్యాన్సర్ మందులు వాడిన ఎనిమిది మంది రోగులను పోలీసులు గుర్తించారు. దీంతో... ఒక ఆందోళన కలిగించే స్కామ్ వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితం వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ రాకెట్ పై విచారణలో ఆందోళనకరమైన విషయాలు తెరపైకి వచ్చాయి.
ఇందులో భాగంగా... ఫార్మసిస్ట్ లు, ఆస్పత్రి సిబ్బంది నుంచి నిందితులు అవసరమైన ఖాళీ మందుల సీసాలను తీసుకున్నారని.. ఆ తర్వాత వాటిని నకిలీ మందులతో నింపి ఫార్మసీలు, ఆన్ లైన్ ఫ్లాట్ ఫారం ల ద్వారా విక్రయించారని ఛార్జిషీట్ ఆరోపించింది. ఈ వ్యవహారంలో సుమారు రూ.4 కోట్ల మార్కెట్ విలువ కలిగిన నకిలీ డ్రగ్స్ కు సంబంధించిన 140 బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ బాధితుల జాబితా కూడా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఉజ్బెకిస్థాన్ కు చెందిన ఓ రోగి ఆరు ఇంజెక్షన్లను రూ.5.92 లక్షలకు కొనుగోలు చేయగా.. జమ్మూ కాశ్మీర్ నివాసి రెండు ఇంజెక్షన్ లను రూ.1.80 లక్షలకు కొనుగోలు చేశారట. ఇదే సమయంలో.. హర్యానా నివాసి ఆరు ఇంజెక్షన్లను రూ.5.67 లక్షలకు కొనుగోలు చేశారని అంటున్నారు.
వీరితోపాటు చండీగఢ్ కు చెందిన ఓ మహిళ తన తల్లికి రూ.13.50 లక్షలతో పది ఇంజెక్షన్లను కొనుగోలు చేయగా.. పంజాబ్ నివాసి తన తల్లి కోసం రూ.16.20 లక్షలకు పన్నెండు ఇంజెక్షన్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. చండీగఢ్ కు చెందిన మరో మహిళ తన అమ్మమ్మ కొసం రూ.13.50 లక్షలు పెట్టి పది ఇంజెక్షన్లు కొన్నారని తెలుస్తోంది.
ఇదే క్రమంలో... పశ్చిమ బెంగాళ్ కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి కోసం రూ.24 లక్షలు పెట్టి ఇరవై నాలుగు ఇంజెక్షన్లు కొనుగోలు చేశారట. ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఏడాది మార్చి 12న క్రైం బ్రాంచ్ ఇంటర్ స్టేట్ సెల్, ఢిల్లీ ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశాయి. అనంతరం మరో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.
ఈ నిందితుల్లో విఫిల్ జైన్ (44) ప్రధాన సూత్రధారి అని అంటున్నారు. ఇతడితో పాటు సూరజ్ షాట్ (27), తుషార్ చౌహాన్ (28), పర్వేజ్ (33), నీరజ్ చౌహాన్ (38), ఆదిత్య కృష్ణ (23), రోహిత్ సింగ్ బిష్త్ (36), కోమల్ తివారీ (39), అభినయ్ సింగ్ (30), జితేందర్ (33), మాజిద్ ఖాన్ (34), సాజిద్ (34)లు మిగిలినవారిలో ఉన్నారని అంటున్నారు.