ఛీఛీ.. చివరకు బీసీ మహిళా మంత్రిని కూడా వదిలిపెట్టరా?

మీ కుటుంబాల్లో ఏదైనా మేలు జరిగిందనుకుంటేనే మాకు ఓటేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలకు పిలుపునిస్తున్నారు.

Update: 2024-01-01 07:35 GMT

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఎవరి సహాయం లేకుండా నేరుగా ఎన్నికల బరిలో దిగుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే రాజకీయాలు ఎప్పుడూ పారదర్శకంగా ఉండాలి. మీ కుటుంబాల్లో ఏదైనా మేలు జరిగిందనుకుంటేనే మాకు ఓటేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలకు పిలుపునిస్తున్నారు. తద్వారా ఆయన ప్రజలనే నమ్ముకుంటున్నారు.

మరోవైపు ఎన్నికల్లో గెలుపొందడానికి టీడీపీ, జనసేన పార్టీలు కుయుక్తులకు పాల్పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరయిన వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే ధైర్యం లేక దాడులు చేయడాన్ని మార్గంగా ఎంచుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బీసీ మహిళా మంత్రి అయిన విడదల రజినిని లక్ష్యంగా చేసుకుని ఆమె కార్యాలయాన్ని ధ్వంసం చేయడం ఇందుకు నిదర్శనమంటున్నారు.

ప్రస్తుతం విడదల రజిని పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు గుంటూరు పశ్చిమ సీటును పార్టీ అధినేత జగన్‌ ఖాయం చేశారు. ఈ నేపథ్యంలో విడదల రజిని ఇప్పటికే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్నారు. తన కార్యాలయం కూడా తెరిచి పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు. ప్రజలు ఏ పని కావాలని వచ్చినా చేసిపెడుతున్నారు.


ఈ నేపథ్యంలో విడదల రజిని గుంటూరు పశ్చిమలో చురుగ్గా వ్యవహరించడాన్ని తట్టుకోలేని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆమె కార్యాలయాన్ని రాత్రికి రాత్రే కొత్త సంవత్సరం నాడు ధ్వంసం చేశారు. కార్యాలయం అద్దాలు పగలగొట్టి ఫ్లెక్సీలు చించేశారు. రౌడీల్లా ప్రవర్తించారు. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబుపై మొదటి నుంచి విడదల రజిని ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఆమెను టార్గెట్‌ గా ఎంచుకుంది. ఈసారి ఎలాగైనా ఆమెను ఓడించాలని కంకణం కట్టుకుంది.


ఈ క్రమంలోనే బీసీ మహిళా మంత్రి అయిన విడదల రజినిని భయపెట్టే ఉద్దేశంతో ఆమె కార్యాలయాన్ని తమ మిత్రపక్షం జనసేన కార్యకర్తలతో కలిపి ధ్వంసం చేయించారని అంటున్నారు. ఎన్నికల్లో నేరుగా పోటీ చేసి తేల్చుకోవాల్సింది పోయి.. ఇలా దాడులు చేయడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.


తాము అధికారంలోకి వస్తే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని చంద్రబాబు, నారా లోకేశ్‌ చెబుతున్నారని.. మరి విడదల రజిని కార్యాలయంపై దాడిని వారు ఎలా సమర్థించుకుంటారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ మాటలకు, చేతలకు హస్తిమశకాంతరం తేడా ఉందని.. ఈ విషయం దాడి ఘటనతోనే తేటతెల్లమైందని చెప్పుకుంటున్నారు.


చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ అనుమతి లేకుండా విడదల రజిని కార్యాలయంపై ఆ పార్టీల కార్యకర్తలు దాడి చేయరని.. వారి అనుమతితోనే దాడి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళను, అందులోనూ బీసీ మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులకు పాల్పడటం ఏమిటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


నిత్యం బీసీ సాధికారత గురించి లెక్చర్లు దంచే చంద్రబాబు, లోకేశ్‌ ఆచరణలోకొచ్చేటప్పటికి తమ కార్యకర్తలతో బీసీలపై దాడులు చేయించడం ఏమిటనే నిలదీస్తున్నారు. బీసీలు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు. బీసీ మహిళా మంత్రిపై దాడి చేయడాన్ని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎలా సమర్థించుకుంటారని నిలదీస్తున్నారు.


ఒక మహిళా నాయకురాలి ఆస్తులు ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త సంవత్సరంలో బీసీలపై దాడులు మొదలుపెట్టిన టీడీపీ, జనసేన నాయకులు ఏకంగా ఒక బీసీ మహిళా మంత్రి పైనే దాడులకి దిగి బీసీలని రాజకీయంగా అణగదొక్కాలని చూస్తున్నారని బీసీలు మండిపడుతున్నారు. బీసీలపై ఇంత కక్ష పెంచుకున్న టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బీసీలు రాజకీయ సమాధి కడతారని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News