తప్పదంతే.. టీమ్ ఇండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు..
చాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి మొదలుకానుంది. అంటే సరిగ్గా నెల కూడా లేదు. కానీ, ఇప్పుడు మరో వివాదం రేగింది.
చాంపియన్స్ ట్రోఫీ.. క్రికెట్ లో ప్రపంచ కప్ తర్వాత అంత పేరున్న టోర్నమెంట్. ఎప్పుడో.. 2017లో జరిగింది.. మళ్లీ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు జరగనుంది.. సాధారణంగా అయితే చాంపియన్స్ ట్రోఫీ పై పెద్దగా రాద్ధాంతం జరగదేమో..? కానీ, పాకిస్థాన్ లో ఆతిథ్యం అనేసరికే వివాదం తప్పదని తేలిపోయింది. అందుకు తగ్గట్లే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ జట్టును పాకిస్థాన్ కు పంపేది లేదని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ కు టీమ్ ఇండియాను పంపడం కుదరదని స్పష్టం చేసింది.
వాస్తవానికి చాంపియన్స్ ట్రోఫీ జరగడమే అరుదు. 2013లో, 2017లో మళ్లీ ఇప్పుడు. దీన్నిబట్టే ఎంత గ్యాప్ ఉందో తెలుస్తోంది. అలాంటిది పాకిస్థాన్ లో నిర్వహణ అంటే అసలు జరగదని, జరిగినా టీమ్ ఇండియా పాల్గొనదని అందరూ ఊహించినదే. మరోవైపు పాకిస్థాన్ మాత్రం భారత్ లో వన్డే ప్రపంచ కప్ నకు తాము వచ్చాం కాబట్టి తమ దేశంలో జరిగే చాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా రావాల్సిందేనని పట్టుబట్టింది. ఓ దశలో టోర్నీ నిర్వహణే సందిగ్దంలో పడింది. అలా.. అలా.. అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు దుబాయ్ లో టీమ్ ఇండియా మ్యాచ్ లు ఆడేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది.
నెల కూడా లేదు..
చాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి మొదలుకానుంది. అంటే సరిగ్గా నెల కూడా లేదు. కానీ, ఇప్పుడు మరో వివాదం రేగింది. అదేమంటే.. టీమ్ ఇండియా జెర్సీపై ఆతిథ్య దేశం పాకిస్థాన్ పేరు. ఈ పేరు మీద భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు అంగీకారం కాదని తెలిపింది. విషయం అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) వరకు వెళ్లింది. వివాదం ముదరక ముందే ఐసీసీ స్పందించింది.
టోర్నీ లోగో (పాకిస్థాన్ పేరు ఉండే)ను ప్రతి జట్టూ తమ జెర్సీకి జత చేసుకోవాలని.. ఈ నిబంధన తప్పదని ఐసీసీ స్పష్టం చేసింది. కాగా, అసలు వివాదానికి బీసీసీఐ వైఖరే కారణం అంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మండిపడింది. క్రికెట్ లోకి రాజకీయాలను తెస్తోందని ఆరోపించింది. ఇది ఆటకు చేటు చేస్తోందని పేర్కొంది. జట్టును పంపడానికి ఒప్పుకోకుండా.. టోర్నీ ప్రారంభోత్సవానికి కెప్టెన్ ను పంపడం లేదని విమర్శించింది. తాజాగా టీమ్ ఇండియా జెర్సీలపై ఆతిథ్య దేశమైన తమ దేశం పేరును వద్దంటున్నారు’’ పీసీబీ అధికారి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొసమెరుపు: ఫిబ్రవరి 19 నుంచి జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి ఈ నెల 12నే జట్ల ప్రకటనకు తుది గడువు ముగిసింది. భారత్ కొంత ఆలస్యంగా జట్టును ప్రకటించింది. మరో ఆరు జట్లూ స్క్వాడ్ లను ప్రకటించాయి. పొడిగించిన గడువు (జనవరి 19) కూడా ముగిసినా.. ఆతిథ్య పాక్ మాత్రం ఇంకా వెల్లడించనే లేదు.