'టీమ్ ఇండియా'పై పద్ధతీ పాడూ లేని బీసీసీఐ సెలక్షన్ కమిటీ

తాజాగా ఇంగ్లండ్ టి20లకు ప్రకంటించిన జట్టులో శుబ్ మన్ గిల్ కు చోటు లేదు. హార్దిక్ ను కూడా కాదని అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ చేశారు.

Update: 2025-01-20 04:03 GMT

ఒకసారి.. ఒక ఆటగాడిని కెప్టెన్ గా నియమిస్తారు.. అంతలోనే అతడిని తప్పిస్తారు.. వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వరు..మరోసారి.. ఒక ఆటగాడిని ఒక సిరీస్ కు జట్టుకు ఎంపిక చేయరు. మరో సిరీస్ కు మాత్రం వైస్ కెప్టెన్ చేస్తారు..ఇంకోసారి.. కెప్టెన్ స్వచ్ఛందంగా తప్పుకొంటాడు.. కానీ, అంతలోనే మళ్లీ అతడి పిలిచి కెప్టెన్సీ ఇస్తారు.మరీ అవసరమైతే అసలు ఊహించని ఆటగాడికి కూడా కెప్టెన్సీ కట్టబెడతారు..

ఇదీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ తీరు. ఇటీవలి కాలంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది.

2023 చివర్లో రోహిత్ శర్మ టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పే యోచనలో క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేశారు. కానీ, ఇంతలోనే రోహిత్ ను మళ్లీ పిలిచి 2024లో జరిగిన టి20 ప్రపంచ కప్ బాధ్యతలు అప్పగించారు. టీమ్ ఇండియా కప్ కొట్టడంతో దీనిపై పెద్దగా విమర్శలు రాలేదు. అదే విఫలమై ఉంటే..? అన్నట్లు టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

టి20 ప్రపంచ కప్ అనంతరం రోహిత్ రిటైర్ కాగా.. హార్దిక్ కు విశ్రాంతి ఇచ్చి జింబాబ్వే టూర్ కు యువ బ్యాటర్ శుబ్ మన్ గిల్ సారథ్యంలో టీమ్ ను పంపారు. అయితే, తర్వాత శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్ కు మాత్రం హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వలేదు. నేరుగా సూర్యకుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగించారు. హార్దిక్ జట్టులో ఉన్నా అతడికి వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వలేదు. శుబ్ మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు.

తాజాగా ఇంగ్లండ్ టి20లకు ప్రకంటించిన జట్టులో శుబ్ మన్ గిల్ కు చోటు లేదు. హార్దిక్ ను కూడా కాదని అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ చేశారు. గిల్ ను ఏకంగా వన్డే ఫార్మాట్ లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీకి వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. హార్దిక్ ను ఎంపిక చేసినా అతడిని ఆటగాడి పాత్రకు పరిమితం చేశారు.

ఇదేం పద్ధతి..?

కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ విషయంలోనే కాదు.. ఆటగాళ్ల ఎంపికలోనూ బీసీసీఐ ధోరణి చర్చనీయం అవుతోంది. ఉదాహరణకు సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ను బంగ్లాదేశ్ తో సిరీస్ లో ఆడించారు. అతడు రాణించాడు కూడా. కానీ, ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే ఆస్ట్రేలియా టూర్ కు మాత్రం ఎంపిక చేయలేదు. అసలు మయాంక్ కు ఏమైందో కూడా బయటకు చెప్పలేదు. అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. అంతకుముందు శ్రీలంకతో వన్డే సిరీస్ కు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తీసుకోలేదు. అతడికి విశ్రాంతి ఇచ్చారా? వేటు వేశారా? అనేది చెప్పలేదు. అదే జడేజా ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఇలా చెప్పుకొంటూ పోతే.. లోపాలు ఎన్నో? మొత్తానికి అజిత్ అగార్కర్ సారథ్యంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఓ అంతుపట్టని వ్యవస్థగా మారింది.

Tags:    

Similar News