చనిపోయి బతికిన టీమ్ ఇండియా మాజీ ఓపెనర్
వూర్కేరి వెంకట రామన్ (డబ్ల్యూవీ రామన్).. తమిళనాడు చెందిన ఎడమచేతివాట బ్యాట్స్ మన్. 1988 నుంచి 1997 వరకు టీమ్ ఇండియాకు ఆడాడు.
అనాఫిలాక్సిస్.. ఓ ప్రమాదకర వ్యాధి. అదేంటి? ఇప్పటివరకు వినలేదు దీని గురించి అంటారా..? ఇప్పుడే తెలిసింది. ఎలాగంటే టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ కు ఎదురైన అనుభవం ద్వారా. ఏ సాధారణ వ్యక్తికో జరిగి ఉంటే మనం ఇప్పుడు చెప్పుకొనేవారం కాదేమో కానీ.. పేరున్న ఆటగాడికి జరగడంతో చర్చనీయాంశం అవుతోంది.
వూర్కేరి వెంకట రామన్ (డబ్ల్యూవీ రామన్).. తమిళనాడు చెందిన ఎడమచేతివాట బ్యాట్స్ మన్. 1988 నుంచి 1997 వరకు టీమ్ ఇండియాకు ఆడాడు. 11 టెస్టులు, 27 వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఫుట్ వర్క్ లేకున్నా బంతిని కనెక్ట్ చేసుకోవడంలో నైపుణ్య కారణంగా, ఎడమచేతి వాటం ఓపెనర్ కావడంతో అవకాశాలు దక్కించుకున్నాడు. అయినా పెద్దగా రాణించకపోవడంతో జాతీయ జట్టుకు దూరమయ్యాడు.
క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక రామన్ కోచింగ్ వైపు మళ్లాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ లకు కోచింగ్ ఇచ్చాడు. 2018లో భారత మహిళల జట్టు కోచ్ గానూ పనిచేశాడు. మహిళల జట్టును గాడినపెట్టిన కోచ్ గా రామన్ కు మంచి పేరే వచ్చింది.
గంభీర్ తో పోటీ పడి టీమ్ ఇండియా హెడ్ కోచ్ పదవికి ఓ దశలో గౌతమ్ గంభీర్ తో పోటీ పడ్డాడు రామన్. కాగా, రామన్ తాను ఎదుర్కొన్న ఓ ఆరోగ్య సమస్య గురించి వెల్లడించాడు. ఈ మేరకు అతడు చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. 'అనాఫిలాక్సిస్' అనే ప్రమాదకర వ్యాధితో తాను బాధపడుతున్నట్లు రామన్ చెప్పాడు. చికిత్స పొందుతున్నప్పటికీ ఇబ్బంది పడుతున్నట్లు వైద్యుడికి చెప్పానని.. అంతలోనే 45-60 సెకన్ల పాటు మరణాన్ని అనుభవించి మళ్లీ బతికానని తెలిపాడు. సమస్య చిన్నదే అనుకుంటే ప్రాణాపాయ స్థితి వచ్చిందని పేర్కొన్నాడు. తనకు ప్రాణ దానం చేసిన వైద్యులకు ధన్యవాదాలు చెప్పాడు.