వరదల్లో తేలుతున్న వేలాది శవాలు..లిబియాలో 20వేల మంది మృతి!

ప్రకృతి ప్రకోపిస్తే మనిషి బ్రతుకు చిగురుటాకైపోతుంది అని అంటారు.

Update: 2023-09-14 10:18 GMT

ప్రకృతి ప్రకోపిస్తే మనిషి బ్రతుకు చిగురుటాకైపోతుంది అని అంటారు. ప్రస్తుతం లిబియాలో ప్రకృతి ప్రకోపంతో నీటిలో వేలాది శవాలు తేలియాడుతున్న పరిస్థితులు హృదయవిధారకంగా ఉన్నాయి. ఇప్పటికి దొరికిన మృతదేహాలు సంఖ్య 5 వేలుదాటగా... మొత్తం మృతిచెందినవారి సంఖ్య 20 వేల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వరదల్లోని మృతదేహాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి.

అవును... ఆఫ్రికా దేశం లిబియాలో ప్రకృతి ప్రకోపించింది. డేనియల్‌ తుపాను సృష్టించిన జల విలయం పెను విషాదాన్ని మిగిల్చింది. గుట్టలుగుట్టలుగా వరదల్లో శవాలు తేలుతూ వస్తున్న దృశ్యాలు భయాందోళనలను కలిగిస్తున్నాయి. వరద కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఎటు చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్న పరిస్థితి ఇప్పుడు లిబియాలో దర్శనమిస్తుంది.

ఈ భారీ వరదల దాటికి రెండు డ్యాం లు కొట్టుకుపోవడంతోనే ఈ మెరుపు వరదలు ఒక్కసారిగా దూసుకొచ్చాయని అంటున్నారు. ఈ మెరుపు వరదలు వేలాది మందిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లగా... ఇప్పుడా ఆ మృతదేహాలు తిరిగి తీరానికి కొట్టుకొస్తున్నాయని. దీంతో తూర్పు లిబియాలోని డెర్నా నగర వీధుల్లో మృతదేహాలు గుట్టలుగా గుట్టలుగా పడి ఉన్నాయి.

ఈ క్రమ్మలో ఈ విపత్తులో ఇప్పటివరకూ ఐదు వేలకు పైగా మృతదేహాలను గుర్తించినట్లు చెబుతున్న అధికారులు... వీరిలో కొందరు విదేశీయులు కూడా ఉన్నారని అంటున్నారు. అదేవిధంగా... ఈ మెరుపు వరదల వల్ల మృతుల సంఖ్య 20వేలకు చేరొచ్చని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నగరంలో మార్చురీలు ఫుల్ అయిపోవడంతో... పక్క నగరాలకు తరలిస్తున్నారు.

మరోపక్క ఈ నగరంలో కనీసం 30వేల మంది నిరాశ్రయులై ఉంటారని అంటున్నారు. ఈ సమయంలో ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి స్థానిక సహాయ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటికే ఈజిప్ట్, యూకే వంటి దేశాలు సహాయ ప్యాకేజీలను అందించాయని తెలుస్తుంది. మరోపక్క యూఏఈ, ఈజిప్టు, తుర్కియే, ట్యునీషియా, ఖతార్‌ దేశాల నుంచి సహాయక బృందాలు చేరుకున్నాయి.

ఇదే సమయంలో 1970 ప్రాంతంలో నిర్మించి, అనంతరం నిర్లక్ష్యానికి గురైన ఒక డ్యాం బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో వరద నీరు దూసుకొచ్చినట్లు లిబియాలో రెడ్‌ క్రాస్‌ కమిటీ ప్రతినిధి చెప్పారు. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉందని తెలిపారు. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెబుతున్నారు.

Tags:    

Similar News