కాకినాడ మాజీ కార్పొరేటర్ నిర్వాకం.. పూజకు గుడికి వెళ్లి ఆర్చకుడిపై దాడి

అధికారం తలకు ఎక్కకూడదు. మిగిలిన వారి కంటే తాను ప్రత్యేకమన్న భావన కొంత మేర ఓకే అయినా.. అది హద్దులు దాటితే ఉపద్రవమే

Update: 2024-03-26 04:17 GMT

అధికారం తలకు ఎక్కకూడదు. మిగిలిన వారి కంటే తాను ప్రత్యేకమన్న భావన కొంత మేర ఓకే అయినా.. అది హద్దులు దాటితే ఉపద్రవమే. విచక్షణ కోల్పోయి ఇష్టారాజ్యంంగా వ్యవహరించే కొందరు తీరు.. మిగిలిన వారికి ఇబ్బందికరంగా మారుతుంది. అలాంటి వ్యవహారమే కాకినాడలో చోటు చేసుకుంది. అధికార పార్టీకి చెందిన ఒక ఛోటా నేత వ్యవహార శైలి కాకినాడ పట్టణంలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అతగాడి తీరును పలువురు తప్పు పడుతున్నారు.

కాకినాడలోని పెద్ద శివాలయంలో పూజ చేయించుకోవటానికి వచ్చారు మాజీ కార్పొరేటర్.. అధికార పార్టీకి చెందిన నేత సిరియాల చంద్రరావు. పూజాసామాగ్రిని తీసుకున్న ఆర్చకుడు సాయి పూజ చేయసాగారు. అయితే.. తాను తీసుకొచ్చిన పాలు శివలింగం మీద సరిగా పోయలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు చంద్రరావు. తాను అధికార పార్టీకి చెందిన నేతనని.. తనకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవేనా? అంటూ మండిపడ్డారు. మిగిలిన భక్తులతో పాటు ప్రసాదం ఇచ్చిన ఉప ఆర్చకుడు సత్యసాయిపై ఆగ్రహాన్నిప్రదర్శిస్తూ చెంప మీద కొట్టారు.

తానేం తప్పు చేశానని కొడతారంటూ ప్రశ్నించిన ఆర్చకుడి తీరుకు మరింత రెచ్చిపోయిన అతను.. నాకే ఎదురు సమాధానం చెబుతావా? అంటూ అసభ్య పదజాలంతో తిట్టి.. కాలితో తన్నటంతో ఆర్చకుడు కింద పడ్డాడు. ఈ గొడవతో అక్కడే మరో ఆలయంలో పూజలు చేస్తున్న మరో ఆర్చకుడు విజయ్ కుమార్ అక్కడకు వచ్చి.. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతడి చెంప మీద కొట్టారు. బూతులు తిడుతూ అందరి అంతు తేలుస్తానని బెదిరిస్తూ వెళ్లిన వైనం అక్కడి భక్తులను షాకిచ్చేలా మారింది.

గుడిలో తమపై జరిగిన దాడిపై ఆర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇది తనకు సంబంధించిన వ్యవహారం కాదని.. డిప్యూటీ కమిషనర్ ను కలవాలని పేర్కొనటంతో ఆర్చకులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారుల సూచనతో ఆలయ ఈవో.. బాధిత ఆర్చకులు కలిసి కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఆర్చకులపై దాడి చేయటం.. విధులకు ఆటంకం కలిగించారన్న నేరాలపై కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసును రాజీ మార్గంలో క్లోజ్ చేయాలన్న ఒత్తిళ్లు ఎక్కువైనట్లుగా చెబుతున్నారు. అయినా.. గుడికి వెళ్లేది ఇలా గొడవలు చేయటానికి.. హింసను ప్రదర్శించటానికా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నేతల తీరు కారణంగా పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

Tags:    

Similar News