చీకటిగది.. పురుగుల అన్నం.. మాజీ ప్రధాని జైలు జీవితం దుర్భరం
40 ఏళ్ల కిందట ఆయనో సమ్మోహన ఆటగాడు.. మైదానంలో దిగాడంటే పొడవాటి జుట్టు ఊగుతుండగా నిప్పులు చెరిగే బంతులేస్తూ బ్యాట్స్ మెన్ పని పట్టేవాడు
ఓ 40 ఏళ్ల కిందట ఆయనో సమ్మోహన ఆటగాడు.. మైదానంలో దిగాడంటే పొడవాటి జుట్టు ఊగుతుండగా సూదంటు రాయి లాంటి చూపుతో నిప్పులు చెరిగే బంతులేస్తూ బ్యాట్స్ మెన్ పని పట్టేవాడు. బ్యాట్ తోనూ కొన్ని పరుగులు కొట్టేవాడు. ఓ ముప్పై ఏళ్ల కిందట అయితే అతడి మేనియా ఆ దేశాన్ని కమ్మేసింది. ఆ జట్టు కలలో కూడా ఊహించని విధంగా ప్రపంచ కప్ అందించి పెట్టాడు. దేశానికి హీరోగా నిలిచాడు. ఆ వెంటనే తల్లి పేరటి కేన్సర్ ఆస్పత్రి ప్రారంభించి.. కొద్ది కాలానికే రాజకీయ పార్టీనీ స్థాపించాడు. అతడెవరో కాదు పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్.
25 ఏళ్లు పోరాడి.. ప్రధాని అయి..
రాజకీయ పార్టీ పెట్టి దారుణ ఓటములను ఎదుర్కొన్నప్పటికీ దాదాపు 25 ఏళ్ల పాటు పోరాడిన ఇమ్రాన్ 2018లో పాక్ ప్రధాని అయ్యారు. కానీ, శక్తిమంతమైన సైన్యం సహకారం పొందారన్న ఆరోపణలున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యా వైపు నిలిచి అమెరికా ఆగ్రహానికి గురయ్యారు. పదవినీ పోగొట్టుకున్నారు. ప్రధాని హోదాలో తనకు వచ్చిన బహుమతులను ఇమ్రాన్ తక్కువ ధరకే సొంతం చేసుకున్నారనే (తోషాఖానా) కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు. వాస్తవానికి ఏడాది నుంచి ఆయన అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. భద్రతా దళాలు కోర్టులోకి వచ్చి మరీ తీసుకెళ్లాయి. తర్వాత ఏకంగా కాల్పులు కూడా జరిగాయి. కాలికి గాయాలయ్యాయి. ఇప్పుడు జాతీయ అసెంబ్లీ రద్దు (ఎన్నికలు) ముంగిట కోర్టు శిక్షకు గురయ్యారు. ఇమ్రాన్ కు ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఆయన ఐదేళ్లు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేదు. అంటే 70 ఏళ్ల ఇమ్రాన్ రాజకీయ జీవితానికి దాదాపు తెరపడినట్లే.
జీవితంలో ఎన్నడూ లేని చీకట్లు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు సారథిగా, వ్యక్తిగతం జీవితంలోనూ అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఓ చీకటి గదిలో ఉన్నారు. అందులో పురుగులు తిరుగుతున్నాయని.. తనను తీసుకెళ్లండని న్యాయవాదులతో వాపోతున్నారాయన . థర్డ్ గ్రేడ్ జైల్లో పెట్టారని.. అందులోనే పూర్తిగా నిర్బంధిస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ట్రయల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో ఇమ్రాన్ ను వెంటనే అరెస్టు చేసి.. పంజాబ్ ప్రావిన్సులోని అటక్ జైలుకు తరలించారు. కానీ, ఆయన ఆత్మస్థైర్యంతోనే ఉన్నారని.. బానిసత్వానికి తలొగ్గనని చెప్పినట్లు పాక్ మీడియాకు వివరించారు. కాగా, ఇమ్రాన్ ను అదియాలా జైలుకు మార్చాలని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసింది.