ఒక్క సీటు కోసం.. మిత్రపక్షంలో త్రిముఖ పోరు.. !
అంటే.. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు.
మిత్రపక్షం.. టీడీపీ-జనసేన పార్టీల అధినాయకులు పై లెవిల్లో కలిసే ఉన్నారు. పార్టీల పరంగా ఇద్దరూ ముందుకు సాగుతున్నారు. కలిసి పనిచేస్తున్నారు. టికెట్ల పైనా దృష్టి పెట్టారు. అంటే.. మొత్తంగా వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాన్ని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అయితే.. పై స్థాయిలో అదినేతలు ఎలా రియాక్ట్ అవుతున్నా.. కలిసి ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు సిగపట్లకు దిగుతున్నారు.
ప్రస్తుతం తెరమీదికి వచ్చిన నియోజకవర్గాల్లో ఒకటి రెండు చోట్ల తమ్ముళ్లు-జనసైనికులు వివాదాలకు పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మేమంటే మేనని ఒకే స్థానంలో నాయకులు ప్రకటించుకుంటున్నారు. ఉదాహరణకు విజయవాడ పశ్చిమ, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాలు దీనికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ వెస్ట్‌లో టీడీపీలోనే రెండు వర్గాలు తెరమీదికి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తనకు టికెట్ ఇవ్వకపోతే.. మైనారిటీ ప్రజలకు ఆగ్రహం వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు.
ఇక, ఇదే నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఉత్తరాంధ్ర నేత బుద్దా వెంకన్న ఏకంగా.. సెంటిమెంటు ప్లే చేస్తు న్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న ఆయన.. పార్టీ కోసం 25 ఏళ్లుగా పనిచేస్తున్నా నని చెప్పారు. పైగా నియోజకవర్గంలో బీసీ నాయకులను ఏకం చేశానని కాబట్టి తనకే టికెట్ ఇవ్వాలని బుద్దా డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలకు తోడు.. విజయవాడ వెస్ట్ సీటును జనసేన ఆశిస్తుండడం గమనార్హం. వచ్చే ఎన్నికలలో జనసేన అభ్యర్థి పోతిన మహేష్ ఇక్కడ నుంచి బరిలో కిదిగి విజయం దక్కించుకో వాలని చూస్తున్నారు.
గత ఎన్నికల్లోనూ పోతిన పోటీకి దిగారు. కానీ, ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడైనా విజయం దక్కించు కోవాలన్నది నాయకుడి ఆశ.దీంతో ఆయన నేరుగా.. జనసేన అధినేతపైనే ఒత్తిడి పెంచుతున్నారు. అటు టీడీపీ కానీ, ఇటుజనసేన కానీ... ఎవరికీ టికెట్ ఎనౌన్స్ చేయలేదు. కానీ, నామినేషన్ల వరకు ఇదే తంతు కొనసాగితే.. పార్టీలకు ఇబ్బందనేది పరిశీలకులు చెబుతున్న మాట. అప్పుడు ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకుంటే.. అది అసమ్మతికి దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు.