బీబీసీ హిస్టరీలో తొలిసారి.. కొత్త ఛైర్మన్ గా మనోడు
ఈ నియామక ఉత్తర్వుపై బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోద ముద్ర వేయటం లాంఛనమని చెప్పాలి.
పరిచయం చేయాల్సిన అవసరం లేని మీడియా సంస్థ బీబీసీ. బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు. అదే బీబీసీ అంటే పిల్లాడైనా ఇట్టే గుర్తిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఈ మీడియా సంస్థకు నూతన ఛైర్మన్ గా భారత మూలాలు ఉన్న మీడియా ప్రముఖుడు 72 ఏళ్ల డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు. బ్రిటన్ సాంస్కృతిక కార్యదర్శి లూసీ ఫ్రేజర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నియామక ఉత్తర్వుపై బ్రిటన్ రాజు చార్లెస్ 3 ఆమోద ముద్ర వేయటం లాంఛనమని చెప్పాలి.
టీవీ ప్రొడక్షన్.. జర్నలిజంలోనూ అపార అనుభవం ఉన్న ఆయనకు సొంతంగా టీవీ చానల్ ఉంది. గతంలో బీబీసీ కరెంట్ అఫైర్స్.. పొలిటికల్ ప్రోగ్రామ్స్ హెడ్ గా పని చేసిన అనుభవం ఉంది. బీబీసీ ఛైర్మన్ గా 2028 మార్చి వరకు కొనసాగనున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తో ఈ మొయిల్ మార్పిడి వ్యవహారం బయటకు పొక్కటంతో బీబీసీ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న రిచర్డ్ షార్ప్ గత ఏడాది తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్ జాన్సన్ కు 8లక్షల యూరోల రుణం పొందటంలో సాయం చేసిన ఉదంతంలో అతను తీవ్రఆరోపణలు ఎదుర్కొన్నారు. అనంతరం జరిగిన విచారణలో అతడి పాత్రపై ఆధారాలు రావటంతో తన పదవికి రాజీనామా చేశారు.
ఇక.. డాక్టర్ సమీర్ షా విషయానికి వస్తే ఆయన భారత సంతతి బ్రిటన్ పౌరుడు. మీడియా ప్రముఖుడిగా మంచి పేరుంది. తాజా నియామకంతో ఆయనకు రూ.1.6 కోట్లు వార్షిక వేతనంగా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఔరంగాబాద్ లో జన్మించిన ఆయన 1960లో యూకేకువెళ్లారు. ఆయనకు సొంతంగా జ్యూపిటర్ టీవీ చానల్ ఉంది. లండన్ వీకెండ్ టీవీలో 1979 నుంచి పని చేస్తున్నారు. సుదీర్ఘకాలం బీబీసీతో అనుబంధం ఉన్న ఆయన్ను 2007లో బీబీసీ ముగ్గురు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లలో ఒకరిగా పేరుంది.