శతాబ్ధంలోనే అత్యంత భయంకరమైన తుఫాన్... వెయ్యి మంది మృతి!?
ఫ్రెంచ్ హిందూ మహాసముద్ర ద్వీపసమూహం మయోట్ లో ఛీడో తుఫాను బీభత్సం సృష్టించింది
ఫ్రెంచ్ హిందూ మహాసముద్ర ద్వీపసమూహం మయోట్ లో ఛీడో తుఫాను బీభత్సం సృష్టించింది. ప్రస్తుతానికి ఈ తుఫాను దాటికి అధికారికంగా 11 మంది మృతి చెందగా.. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. ఇదే సమయంలో 246 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
అవును... హిందూ మహాసముద్రంలోని ఫ్రెంచ్ ద్వీపకల్పం మయోట్ లో చీడో తుఫాను బీభత్సం సృష్టించింది. ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను కారణంగా మాయోట్ భారీగా నష్టాన్ని చవిచూసిందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో.. పక్కనున్న కొమోరోస్, మడగాస్కర్ ద్వీపాలపైనా ఛీడో ప్రభావం చూపించిందని చెబుతున్నారు.
ఈ ద్వీపకల్పాలు, ద్వీపాలు అన్నింటిపైనా ఛీడో తూఫాను కారణంగా మృతుల సంఖ్య వెయ్యి వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. సుమారు గత 90కి పైగా సంవత్సరాల్లో ఇలాంటి తుఫాన్ చూడలేదని చెబుతుండటం గమనార్హం.
ఈ ఘటనపై స్పందించిన ఫ్రెంచ్ స్థానిక సీనియర్ అధికారి ప్రిపెక్ట్ ఫ్రాంకోయిస్ జేవియర్ స్పందిస్తూ.. మృతుల సంఖ్య కచ్చితంగా వందల సంఖ్యలో ఉందని భావిస్తున్నాము.. వేలకు చేరుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. ఇదే సమయంలో బాధితుల సంఖ్యను లెక్కించడానికి చాలా సమయం పడుతుందని చెప్పుకొచ్చారు.
ఈ ఛీడో తుఫాను కారణంగా మయోట్ లో గంటకు సుమారు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని.. ఫలితంగా గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఈ తీవ్రత దాదాపు అణుయుద్ధంతో సమానం అంటూ స్థానికులు స్పందిస్తున్నారని అంటున్నారు.
కాగా.. పారిస్ నుంచి సుమారు 8,000 కిలో మీటర్ల దూరంలో ఉన్న వయోట్టే ప్రాంతం మిగిలిన ఫ్రాన్స్ తో పోలిస్తే చాలా పేదది.. అయినప్పటికీ ఫ్రెంచ్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకారం ఇక్కడ సుమారు 1,00,000 మందికి పైగా పత్రాలు లేని వలసదారులు నివసిస్తున్నారని చెబుతున్నారు. దీంతో... మరణాల సంఖ్యను నిర్ధారించడం కష్టంగా మారిందని అంటున్నారు.