గిన్నిస్ రికార్డ్స్ లో ఈ ఫ్యామిలీని బీట్ చేసే వారే లేరు!
అయితే.. తాజాగా కేరళకు చెందిన కుటుంబం ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.
రికార్డుల్ని క్రియేట్ చేయటం అంత తేలికైన విషయం కాదు. అందునా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవటం కష్టమైన.. క్లిష్టమైన ప్రక్రియ. పాతికేళ్ల క్రితం గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసేందుకు ఎంతలా తహతహలాడే వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో ఆ కొరత తీరి.. పలువరు భారతీయులు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరును నమోదు చేసుకున్నారు. అయితే.. తాజాగా కేరళకు చెందిన కుటుంబం ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశారు.
సాధారణంగా గిన్నిస్ లో ఒకరు నమోదు కావటమే కష్టమనుకుంటే.. ఈ కుటుంబం మాత్రం ఫ్యామిలీ ప్యాకేజ్ మాదిరి ఒకరి తర్వాత ఒకరు చొప్పున గిన్నిస్ లో పేరును నమోదు చేసుకుంటున్నారు. దీంతో.. ఈ కుటుంబం ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు అత్యధికంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేర్లను నమోదు చేసుకోవటంలో ముందుంది.
కేరళలోని మలప్పురానికి చెందిన ఈ కుటుంబంలో ఇప్పటివరకు ముగ్గురు గిన్నిస్ లో పేరు నమోదు చేసుకున్నారు. నాలుగో వ్యక్తి సైతం తన పేరు ఎక్కేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ విషయానికి వస్తే.. గిన్నిస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. చేతులను ఉపయోగించకుండా 8.57 సెకన్ల వ్యవధిలో అరటిపండు తిని ఆ కుటుంబంలోని అబ్దుల్ సలీం గిన్నిస్ రికార్డ్స్ లోకి ఎక్కారు.
అనంతరం ఆయన కుమార్తె జువైరియా.. తన మోచేతులు.. మోకాళ్లపై నడుస్తూ తలపై చేతిని ఉంచుకొని 54 మెట్లు ఎక్కింది. మరో కుమార్తె అయేషా సుల్తానా అయితే ఆరోహణ.. అవరోహణ క్రమంలో పుస్తకాలను 16.50 సెకన్ల వ్యవధిలో అమర్చింది. దీంతో వీరు ముగ్గురు గిననిస్ రికార్డుల్లో పేరును నమోదు చేసుకున్నారు. తాజాగా సలీం భార్య రషీద.. కూడా గిన్నిస్ లో పేరు నమోదు చేసుకోవటానికి కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. ఆమె కూడా రికార్డును క్రియేట్ చేస్తే.. మరో రికార్డు అవుతుందని చెబుతున్నారు.