ఏపీలో స్టార్ట్ అయిన ఫ్రీ బస్ సర్వీస్... మహిళలకు కాదు సుమా!!

ఈ నేపథ్యంలో వైజాగ్ లో ఉచిత బస్సు సేవలు ప్రారంభమయ్యాయి.

Update: 2024-10-22 14:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు హామీ ఒకటి. రాష్ట్రంలో ప్రతీ రోజూ 20 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తుండటంతో.. ఈ హామీ ఫుల్ సక్సెస్ అయ్యింది! ఈ క్రమంలో త్వరలో ఈ హామీని అమలు చేయనున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ లో ఉచిత బస్సు సేవలు ప్రారంభమయ్యాయి.

అవును... ఏపీలో మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు హామీని త్వరలో కూటమి ప్రభుత్వం నెరవేర్చనుందని అంటున్నారు. ఈలోపు ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... వైజాగ్ లోని ఐటీ ఉద్యోగులకు ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ రుషికొండ ఐటీ హిల్స్ కు నాలుగు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించింది.

ఈ మేరకు మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, వైజాగ్ ఎంపీ శ్రీభరత్ లు ఇన్ఫోసిస్ ప్రాంగణంలో పూజలు చేసి, ఈ బస్సు సర్వీసులను ప్రారంభించారు. విశాఖలో ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకొవచ్చు.

ఇక ఈ బస్సులు ప్రతీరోజు ఉదయం 8 గంటలకు గజువాక, పెందుర్తి, కూర్మన్నపాలెం, విజయనగరం నుంచి బయలుదేరి రుషికొండ ఐటీ హిల్స్ కు చేరుకుంటాయి. ఇక.. సాయంత్రం 5:50 గంటలకు ఐటీ పార్క్ నుంచి తిరిగి బయలుదేరుతాయి.

ఈ నాలుగు బస్సులే కాకుండా.. ద్వారకా, గాజువాకల నుంచి మరో రెండు సర్వీసులు ప్రారంభమవుతాయని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన గంటా శ్రీనివాస్ రావు... రానున్న రోజుల్లో విశాఖపట్నంలో మరిన్ని ఐటీ సంస్థలు తమ క్యాంపస్ లను ప్రారంభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ఆఫీసును ఎంపీతో కలిసి తనిఖీ చేశారు.

ఈ ఆర్టీసీ బస్సుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ నేపథ్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఇచ్చిన ఆర్టీసీ బస్సుల్లో ఉచిత హామీ పథకాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఈ ఉచిత సర్వీసులపై ఐటీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి థాంక్స్ చెబుతున్నారు!

Tags:    

Similar News