బాబు దయ వల్లే అన్న టీచర్ ఎమ్మెల్సీ గాదె
తన విజయానికి సహకరించిన ముఖ్యమంత్రికి, కూటమికి ధన్యవాదాలు అని ఆయన చెప్పారు.;
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆయన నివాసం అయిన ఉండవల్లి లో కలసి ధన్యవాదాలు తెలిపారు. తన విజయానికి సహకరించిన ముఖ్యమంత్రికి, కూటమికి ధన్యవాదాలు అని ఆయన చెప్పారు. చంద్రబాబు సైతం మంచి మెజారిటీతో గెలిచిన గాదెను అభినందించారు.
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు అంటే ప్రభుత్వానికి ఎంతో గౌరవం అని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడానికి మంత్రి నారా లోకేష్ ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
ఇక ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి వారి సూచనలు సలహాలతో మాత్రమే తీసుకుంటుందని బాబు చెప్పడం విశేషం. అంతే కాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు.
అదే విధంగా రాష్ట్రంలో నాణ్యమైన విద్యాబోధన కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నామని బాబు చెప్పారు. ఇక ముఖ్యమంత్రిని కలసిన సందర్భంగా గాదె ఎంతో ఆప్యాయంగా వ్యవహరించడం విశేషం. చంద్రబాబుతో మీ వల్లనే గెలిచాను అని చెప్పడమూ విశేషం.
నిజానికి చూస్తే కూటమి మద్దతు సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన పాకలపాటి రఘువర్మకు ఇచ్చింది. ఆయన విజయం కోసమే టీడీపీ జనసేన కృషి చేశాయి. కానీ గాదె మాత్రం తనకు కూటమి సహకారం లభించింది అని చెప్పడం గమనార్హం. ఆయన చంద్రబాబుకు ఈ విషయంలో ధన్యవాదాలు చెప్పడమూ విశేషం.
అయితే కూటమిలో ఒక పార్టీ అయిన బీజేపీ గాదె విజయానికి కృషి చేసింది. దాంతో గాదె వెంట బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా సీఎం ఇంటికి వచ్చారు. అదే విధంగా పీఆర్‌టీయు రాష్ట్ర అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలజీ, ఆప్టా రాష్ట్ర అధ్యక్షులు ఏజీఎస్ గణపతి రావు, ఎస్టీయు విశాఖ జిల్లాకార్యదర్శి ఇ.పైడి రాజు, ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎష్.సదాశివరావు, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర సీపీఎస్ కన్వీనర్ గుజ్జల తిరుపాల్, గుంటూరు జిల్లా పీఆర్‌టీయు అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ, రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కాశీ విశ్వేశ్వరరావు, తదితరులు సీఎం ని కలసిన వారిలో ఉన్నారు.
ఇక చూస్తే గాదె ఎమ్మెల్సీ అయ్యాక చంద్రబాబుకు కలవడం మర్యాదపూర్వకంగానే అని చెబుతున్నారు. అదే సమయంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సహకారం అవసరం అన్నది తెలిసిందే. అందువల్లనే చంద్రబాబుని కలవడం ద్వారా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ సమస్యలకు గాదె ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ఎటూ ఎమ్మెల్సీ అయ్యారు. అందువల్ల ప్రభుత్వంతో సానుకూలంగా సయోధ్యతోనే ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఇప్పటికి మూడు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్సీ గాదెకు తెలుసు అని అంటున్నారు. అందుకే ఆయన కూటమి దయ చేత గెలిచాను అని చెప్పారని అంటున్నారు. మొత్తానికి గాదె గెలుపు వెనక కూటమి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్స్ కి గాదె బాబుకి చెప్పిన ధన్యవాదాలకూ సరిగ్గా సరిపోయింది అని అంటున్నారు.