గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ శ్రీరాములు.. పతాక స్థాయికి చేరిన వివాదం

మాజీ మంత్రి శ్రీరాములు ఒక అడుగు ముందుకు వేసి మరి గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను బయటపెడతానంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.

Update: 2025-01-24 18:30 GMT

కర్ణాటక రాజకీయాల్లో గాలి జనార్దన్ రెడ్డి, శ్రీరాములు గురించి తెలియకుండా ఎవరికి ఉండదు. వీరిద్దరూ అత్యంత సన్నిహితులు. అత్యంత ఆత్మీయంగా మెలిగిన ఈ ఇద్దరు నేతల మధ్య ఇప్పుడు వైరం పురుడు పోసుకుంది. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు.

మాజీ మంత్రి శ్రీరాములు ఒక అడుగు ముందుకు వేసి మరి గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను బయటపెడతానంటూ బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. తాజాగా బళ్లారి హవంభావి సమీపంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీరాములు గాలి జనార్దన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను ఒక రౌడీలా చిత్రీకరించాలని చూస్తున్నావని, నీ మాటలు ఎవరు నమ్మరని శ్రీరాములు వ్యాఖ్యానించారు.

'నావల్ల నీవు ఎదిగావో.. నీవల్ల నేను ఎదిగానో జనానికి తెలుసు' అని పేర్కొన్నారు. రెండు రోజుల కిందట బెంగళూరులో బిజెపి హై కమిటీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో తాపే సండూరు ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయానికి పనిచేయలేదని పేర్కొంది. దీనిపై స్పందించిన శ్రీరాములు.. ఇది ముమ్మాటికి అసత్యం అని, తాను పార్టీ అభ్యర్థి కోసం పనిచేశానని స్పష్టం చేశారు. ఈ అసత్యపు ప్రచారం గాలి జనార్దన్ రెడ్డి సృష్టిస్తున్నారని, తాను ముందు నుంచి బిజెపిలో ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని వివరించిన శ్రీరాములు.. 14 ఏళ్లుగా ఆయన జైల్లోనే ఉన్నాడని వ్యాఖ్యానించారు. ఆయనకు ఇక్కడ ప్రాధాన్యం తగ్గిందని, అందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

పార్టీలో తనకొంటూ ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్న శ్రీరాములు.. ఓడిపోయిన పార్టీ విడలేదని స్పష్టం చేశారు. ఎస్టి నాయకుడిగా ప్రజలు తనను ఆదరిస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో గ్రూపులు పెట్టడం, పార్టీ వాళ్ళనే ఓడించేందుకు జనార్దన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా శ్రీరాములు మరో సంచలన ఆరోపణను చేశారు. కంప్లిలో తన అల్లుడు సురేష్ బాబుని ఓడించేందుకు గాలి గ్రూపు రాజకీయాలు చేశారని ఆరోపించారు. పార్టీలో సమస్యలు సర్దుకుంటాయని, కానీ జనార్దన్ రెడ్డితో మనస్పర్ధలు మర్చిపోలేనని స్పష్టం చేశారు. పేదలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని వెల్లడించారు. గాలి జనార్దన్ రెడ్డి అనేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కల్పితాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీరాములు చేసిన ఈ వ్యాఖ్యలు దుమారాన్ని సృష్టిస్తున్నాయి. అవసరమైతే తాను గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలను బయటపెడతారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటక రాజకీయాల్లో సంచలనాన్ని సృష్టిస్తున్నాయి.

Tags:    

Similar News