పింఛన్ డబ్బులతో జూదం.. వాలంటీర్ ఘనకార్యాన్ని పట్టేసిన పోలీసులు

జిల్లా లోని విడపనకల్లుకు చెందిన గ్రామ వాలంటీర్ ఒకరు పెద్ద వయస్కుల కు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బుల్ని.. జూదానికి ఖర్చు చేశాడు.

Update: 2023-08-03 04:19 GMT

వ్యవస్థను ఎంత కట్టుదిట్టంగా సిద్దం చేసినా.. కొందరు తప్పుడు తీరుతో అందరికి తలవంపులుగా మారుతుంటాయి. ఏపీ లో ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ పుణ్యమా అని.. సగటు జీవికి అవసరమైన అన్ని అంశాల్లోనూ వాలంటీర్లు చేదోడు వాదోడుగా నిలవటమే కాదు.. గతం లో మాదిరి అదే పనిగా చిన్న పనుల కు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసింది. అయితే.. ఈ వ్యవస్థలోనూ కొందరి తప్పులు అందరికి తలనొప్పులుగా మారుతుంటాయి.

ఆ కోవలోకే వస్తుంది అనంత జిల్లాలో వెలుగు చేసిన వైనం. జిల్లా లోని విడపనకల్లుకు చెందిన గ్రామ వాలంటీర్ ఒకరు పెద్ద వయస్కుల కు ఇవ్వాల్సిన పింఛన్ డబ్బుల్ని.. జూదానికి ఖర్చు చేశాడు. ఆ డబ్బులు మొత్తం పోయాక.. నిజం చెప్పకుండా తనను బెదిరించి తన నుంచి డబ్బులు లాక్కెళ్లినట్లుగా కట్టుకథను అల్లేశాడు. అయితే.. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బయటకు వచ్చింది. అసలేం జరిగిందంటే.

విడపనకల్లు కు చెందిన గ్రామ వాలంటీరు ఆగస్టు ఒకటిన పింఛన్ల డబ్బుల్ని పంచేందుకు అధికారుల నుంచి రూ.89వేల మొత్తాన్ని తీసుకెళ్లాడు. ఆ డబ్బుల్ని కర్నూలు జిల్లా గుమ్మనూరు కు దగ్గర్లో జరిగే జూదానికి వెళ్లాడు. పింఛన్ డబ్బులు మాత్రమే కాదు తన వద్ద ఉన్న బంగారు ఉంగరం.. సెల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు.

జరిగిన విషయాన్ని చెబితే తలనొప్పులు అనుకున్న అతగాడు.. తన దగ్గరి డబ్బులు.. ఉంగరం పోవటానికి కారణం దోపిడీ దొంగలంటూ కట్టుకథ అల్లేశాడు. తాను పింఛన్ డబ్బులతో వస్తుంటే.. మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు తన ను ఆపి డబ్బులు ఇస్తే ఫోన్ పే చేస్తామని చెబితే తాను ఒప్పుకున్నానని.. ఇందుకోసం కమిషన్ ఇస్తానంటే కక్కుర్తి పడ్డానని.. వారితో పాటు తాను వెళ్లినట్లు చెప్పారు. కర్ణాటక సరిహద్దుల్లోని ఒక గ్రామానికి తీసుకెళ్లి బెదిరించినట్లుగా చెప్పారు. దీంతో.. తన దగ్గరున్న డబ్బుల్ని.. బంగారు ఉంగరాన్ని కూడా పోగొట్టుకున్నట్లు చెప్పారు.

సదరు వాలంటీరు చెప్పే మాటల్లో తేడా రావటంతో పోలీసుల కు అనుమానం వచ్చింది. దీంతో.. తమదైన శైలి లో విచారణ చేయటంతో.. తాను చేసిన తప్పుడు పనుల గురించి చెప్పుకొచ్చాడు. దీంతో.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ తరహా ఉదంతాలతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారతాయన్న ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ ను బయట కు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే.. వాలంటీర్ వ్యవస్థలో జరిగే లోపాల్ని.. స్థానిక పోలీసులు పట్టేసి.. వారి విషయంలో తగిన రీతి లో చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. తప్పులు చేసిన వారిని దాచే కన్నా.. ఇలా ఓపెన్ గా చెప్పేయటమే మంచిది.

Tags:    

Similar News