కారణం తెలుసుకోవాల్సిందే... నాణాలతో నామినేషన్ ను తిరస్కరించిన అధికారులు!
దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికలతో సందడి నెలకొంది. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాలకు తెరలేపాయి.
దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికలతో సందడి నెలకొంది. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారాలకు తెరలేపాయి. మరోపక్క చిన్నా చితకా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి సైతం సరిపడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి! ఈ సమయంలో తాజాగా నామినేషన్ వెయ్యాలని చిల్లర నాణాలతో వెళ్లిన ఒక అభ్యర్థికి చేదు అనుభవం ఎదురైంది.. అలాంటి ఒక రూల్ ఉందనే విషయం తెలిసి లబో దిబో మంటున్నారు!
అవును... ఐదురాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఛత్తీస్ గఢ్ లో కూడా ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అఖిల భారత ట్రాన్స్‌పోర్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు గణేశ్ దాస్ మహంత్ రెడీ అయ్యారు. ఇందులో భాగంగా... కోర్బా స్థానం నుంచి పోటీ చేయాలని భావించిన గణేశ్... మంగళవారం (అక్టోబర్ 31) తుల్సీనగర్ బస్తీలోని ఈసీ కార్యాలయానికి వెళ్లారు.
ఈ సందర్భంగా... నామినేషన్ వేసేందుకు చెల్లించాల్సిన డబ్బు రూ.10 వేలను కాయిన్స్ రూపంలో అధికారులకు ఇవ్వబోయారు. వాటిలో అన్నీ రూపాయి, రెండు, 5 రూపాయల నాణేలే ఉండటంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ప్రశ్నించగా... రూ.వెయ్యి వరకు మాత్రమే నాణేల రూపంలో తీసుకోడానికి అనుమతి ఉందని.. రూ.10వేలను చిల్లరగా తీసుకోలేం అని ఎన్నికల అధికారులు తేల్చి చెప్పారు. దీంతో గణేశ్ దాస్ షాక్ అయ్యారు.
పైగా... మంగళవారం ఎన్నికల నామినేషన్ల చివరిరోజు కావడంతో కేవలం చిల్లర నాణాలు తెచ్చిన కారణంగానే ఆయన నామినేషన్ వేయలేకపోయారు. దీంతో... నామినేషన్ వేసే సమయంలో ఇటువంటి ఇబ్బంది వస్తుందని ఊహించలేకపోయానని వాపోతున్నారు. తన వద్ద అంత మొత్తం లేకపోవటంతో.. గత నాలుగేళ్లుగా డ్రైవర్ల యూనియన్ సభ్యులు ఇస్తున్న చిల్లరను జమ చేసి ఈ డబ్బునే తీసుకొచ్చానని తెలిపారు!
కాగా... చిల్లర నాణాలతో నామినేషన్లు వేసిన సందర్భాలు చాలా చోట్ల జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వెయ్యడానికి ఎన్. రాజశేఖర్ అనే గ్రాడ్యుయేట్ విశాఖ కలెక్టరేట్ కు వచ్చాడు. శ్రీముఖ లింగం దేవాలయ ప్రధాన ఆర్చకుడిగా పని చేస్తున్న అతడు... నామినేషన్ కోసం చిల్లర నాణాలను తీసుకొచ్చాడు.
ఇలా నామినేషన్ డిపాజిట్ కట్టేందుకు ఒకటి, రెండు, ఐదు రూపాయిల నాణెల్ని తనతో పాటు పెద్ద మూట కట్టుకొచ్చాడు. ఆ చిల్లర మొత్తాన్ని చూసి షాక్ తిన్న సిబ్బంది.. తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని కుప్పగా పోసి లెక్కించారు.. నామినేషన్ వేయనిచ్చారు! ఇదే సమయంలో ఇటీవల మధ్యప్రదేశ్ లో కట్ని జిల్లా ముద్వారా అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ పడుతున్నారు న్యాయవాది సందీప్ నాయక్ కూడా నామినేషన్ వేసేందుకు సొమ్మును నాణాలగానే ఇచ్చారు. అధికారులు నాలుగు గంటల పాటు లెక్కించి ఓకే చేశారు.
కానీ... గణేశ్ దాస్ విషయంలో మాత్రం ఈ పరిస్థితి నెలకొందనే కామెంట్లు నెట్టింట దర్శనమిస్తున్నాయి. ఈ సమయంలో... రూ.1000 మాత్రమే నాణాల రూపంలో తీసుకోవచ్చని.. మిగిలిన రూ.9,000లు నోట్ల రూపంలో చెల్లించాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది!!