మరోసారి గన్నవరం గరంగరం!

కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. టీడీపీకి కంచుకోటలనదగ్గ నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి

Update: 2024-01-26 06:25 GMT

కృష్ణా జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటి. టీడీపీకి కంచుకోటలనదగ్గ నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. కాంగ్రెస్, వైసీపీ గాలి ప్రభంజనంలా వీచిన 2004, 2009, 2014, 2019ల్లో గన్నవరంలో టీడీపీదే విజయం. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు గన్నవరంలో ఖాతా తెరవలేకపోయిన వైసీపీ ఆ నియోజకవర్గంపై పై దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీమోహన్‌ ను వైసీపీలో చేర్చుకున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలైన యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలోకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున యార్లగడ్డ పోటీ చేయడం ఖాయం.

ఇప్పుడు వైసీపీ, టీడీపీలకు తోడు మూడో పార్టీ కాంగ్రెస్‌ కూడా గన్నవరంలో పోటీకి సిద్ధమవుతోంది. తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. గన్నవరంలో వైసీపీ ముఖ్య నేత, వైసీపీ పొలిటికల్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ సభ్యుడు అయిన దుట్టా రామచంద్రరావును కలిశారు. దుట్టా దివంగత సీఎం వైఎస్సార్‌ కు మిత్రుడు. ఆయనతో కలిసి విద్యనభ్యసించారు. గతంలో కాంగ్రెస్‌ లో కొనసాగిన ఆయన వైఎస్సార్‌ మరణాంతరం వైసీపీలో కొనసాగుతున్నారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున గన్నవరం బరిలోకి దిగిన దుట్టా రామచంద్రరావు ఓటమి పాలయ్యారు. 2019లో ఆయనకు వైసీపీ సీటు ఇవ్వలేదు. యార్లగడ్ల వెంకట్రావుకు సీటు ఇచ్చింది. దీంతో దుట్టాకు ఎమ్మెల్సీ పదవిని కానీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని కానీ ఇస్తామని ఆఫర్‌ చేసింది. అయితే ఇంతవరకు ఆయనకు పదవి ఇవ్వలేదు. ఆయన కుమార్తె ఉంగుటూరు జెడ్పీటీసీగా ఎంపికైనా నిరాశే ఎదురైంది.

మరోవైపు దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్‌ రెడ్డి వైసీపీ రాష్ట్ర వైద్యుల విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయినప్పటికీ దుట్టాకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఎలాంటి న్యాయం చేయలేదనే అసంతృప్తి ఆయనలో ఉందని అంటున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ వైసీపీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ దుట్టా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీలోకి వల్లభనేని వంశీని వ్యతిరేకిస్తూ ఇటీవల కాలం వరకు యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి దుట్టా గ్రూపు రాజకీయం నడిపారు. అయితే యార్లగడ్డ టీడీపీలోకి ళ్లడంతో దుట్టా ఒంటరిగా మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల గన్నవరంలో దుట్టాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దుట్టాను వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ లోకి ఆహ్వానించారు. ఆయన కూడా కాంగ్రెస్‌ లో చేరడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ప్రస్తుతం షర్మిల తన తండ్రితో కలిసి పనిచేసిన నాయకులందరినీ కాంగ్రెస్‌ లోకి ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు వారిని స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు. ఇందులో భాగంగా గన్నవరంలో దుట్టా రామచంద్రరావును కలిశారు. దుట్టా వచ్చే ఎన్నికల్లో గన్నవరంలో బరిలోకి దిగితే త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News