భీమిలీ వేదికగా బొత్స గంటా భీకర పోరు...!?

బొత్స సొంత సీటు అయిన విజయనగరం జిల్లా చీపురుపల్లికి మాజీ మంత్రి గంటాను పంపించాలన్నది చంద్రబాబు ప్లాన్.

Update: 2024-03-08 03:39 GMT

వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణను ఓడించడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఆయుధంగా టీడీపీ ప్రయోగిస్తోంది. ఈ విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉన్నా ఇపుడిపుడే రాజకీయం ఒక కొలిక్కి వస్తోంది. బొత్స సొంత సీటు అయిన విజయనగరం జిల్లా చీపురుపల్లికి మాజీ మంత్రి గంటాను పంపించాలన్నది చంద్రబాబు ప్లాన్. ఈ విషయంలో రెండవ మాటకు తావు లేదని గంటాకు చెప్పేసారు అని అంటున్నారు.

అయితే తాను ఆలోచించుకుని చెబుతాను అని గంటా అన్నారు. ఆయనకు ఇష్టం లేదు కానీ హై కమాండ్ ఆదేశంతో ఇక వెళ్లక తప్పదు అని గంటా కూడా మానసికంగా ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఈ సందర్భంలోనే ఆయన బొత్స మీద హాట్ కామెంట్స్ చేశారు అని అంటున్నారు. బొత్స మూడు సార్లు ఓడిన వారు అని ఆయనకు ఓటమి అనుభవం ఉందని సెటైర్లు వేశారు. తాను ఎపుడూ ఓడిపోలేదని గుర్తు చేశారు.

దాంతో తాను కనుక రంగంలో ఉంటే బొత్స మాజీ అవడం ఖాయమని గంటా ధీమాగా చెబుతున్నారు అన్న మాట. అంటే చీపురుపల్లి అయినా తాను అడుగు పెడితే గెలుపు ఖాయమని గంటా చెప్పేశారు అని అంటున్నారు. ఇలా చంద్రబాబు మాటకు విలువ ఇచ్చి వెళ్లడానికి గంటా ప్రిపేర్ అవుతున్న దశలో మరో ప్రచారం తెర మీదకు వస్తోంది.

గంటా చీపురుపల్లి వెళ్లనవసరం లేకుండానే బొత్సాయే గంటాను వెతుక్కుంటూ విశాఖ జిల్లాకు వస్తున్నారు అని అంటున్నారు. తన సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న నేపధ్యంలో తాను కూడా విశాఖలో భీమిలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ద్వారా ఆమె విజయం లో పాత్ర కావాలని ఆమెను గెలిపించుకోవాలని బొత్స చూస్తున్నారుట. మూడున్నర లక్షల ఓట్లు ఉన్న ఏకైక పెద్ద నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ పరిధిలో భీమిలీ ఉంది.

ఇక భీమిలీ విజయనగరానికి ఆనుకుని ఉంది. తూర్పు కాపులు యాభై నాలుగు వేల దాకా ఇక్కడ ఉన్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్స అందుకే ఈ సీటులో పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. ఓసీ కాపులు కూడా మరో ఇరవై వేల దాకా ఉన్నారని లెక్క ఉంది. అంటే మొత్తం ఓటర్లలో పాతిక శాతం కాపులు ఉన్న సీటు భీమిలీ. ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవడం ద్వారా విశాఖ జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పాలన్నది బొత్స ఎత్తుగడ.

దీంతో భీమిలీ నుంచి పోటీ చేయాలని చూస్తున్న గంటాకు ఇక్కడ తానే స్వయంగా వస్తున్న బొత్స ప్రత్యర్థిగా మారనున్నారు అని అంటున్నారు. భీమిలీలో బొత్స పోటీ చేస్తే గంటా ఆయనకు టీడీపీ నుంచి బలమైన ప్రత్యర్ధి అవుతారని చంద్రబాబు భావిస్తున్నారు. దాంతో భీమిలీ టికెట్ గంటాకే ఇస్తారు అని అంటున్నారు.

అంటే ఏ విధంగా చూసినా గంటా బొత్సల మధ్య రాజకీయ యుద్ధం ఈసారి తప్పకపోవచ్చు అని అంటున్నారు. ఏ కారణంగా చంద్రబాబు బొత్స మీదకు గంటాను సిద్ధం చేశారో తెలియదు కానీ ఇపుడు అదే నిజం కాబోతోంది అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. దాన్ని బొత్స తనకు అనుకూలంగా వాడుకుంటారు అని అంటున్నారు.

విశాఖ సిటీతో పాటు కొన్ని చోట్ల తప్పించి ఉత్తరాంధ్రా అంతటా తూర్పు కాపులు ఉన్నారు. వారు బీసీల కిందకు వసారు. బొత్స అదే సామాజిక వర్గం. అయితే గంటా ఓసీ కాపు. దాంతో బీసీ కాపులు ఓసీ కాపులు అన్న తేడా ఉంది. బీసీ కాపులే విశాఖ సహా అన్ని చోట్లా ఎక్కువ.

పైగా లోకల్ గా తాను ఉన్నాను అని చెప్పి నాన్ లోకల్ గంటా అని ఆయన ఓసీ అని ఇలా రెండు రకాలైన కార్డులు తీసి ఓడించాలి అన్నది బొత్స వ్యూహంగా ఉంది. మరో వైపు చూస్తే గంటాకు గతంలో మాదిరిగా ఈసారి భీమిలీ అనుకూలించే అవకాశాలు లేవు అని అంటున్నారు. ఆయన సీటు తెచ్చుకుంటే జనసేన సహకారం కూడా ఎంత మేరకు ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News