జూ. ఎన్టీఆర్ పై స్పందించిన గంటా... సంచలన వ్యాఖ్యలు!
అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ పైనా స్పందించారు.
స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ధోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ పైనా స్పందించారు.
అవును... చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ గంటా శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఏకమవుతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, బెంగుళూరుల్లో ఐటీ ఉద్యోగులు ముందుకు వచ్చి మద్దతిస్తున్నారని అన్నారు.
ఇదే సమయంలో 16 నెలలు జైల్లో వున్న జగన్ కావాలనే చంద్రబాబును జైలుకు పంపారని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డవలప్మెంట్ కేసును తిరిగిపైకి తెచ్చి చంద్రబాబుపై కక్షసాధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయడానికి ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు.
అనంతరం, సినిమా ఇండస్ట్రీ జనాలు చంద్రబాబుకు మద్దతు పలికే విషయంలో అనాసక్తిని చూపుతున్నారన్నట్లుగా వస్తున్న కథనాలపై గంటా శ్రీనివాస రావు స్పందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారని.. ఇదే సమయంలో రాఘవేంద్రరావు, అశ్వినీదత్ కూడా రియాక్ట్ అయ్యారని తెలిపారు. రజనీకాంత్ ఫోన్ చేసి లోకేష్ తో మాట్లాడి సంఘీభావం ప్రకటించారని అన్నారు.
గత నాలుగున్నర సంవత్సరాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏ విధంగా వేధించారనేది చూస్తూనే ఉన్నామని చెప్పిన గంట... టిక్కెట్ రేట్ల విషయంలో ఇండస్ట్రీలోని పెద్దలంతా జగన్ ఇంటికి వచ్చి ప్రాదేయపడి కలిసిన తర్వాత ఆయన ఈగో కాస్త శాటిస్ ఫై అయ్యిందని చెప్పుకొచ్చారు. ఎవరైనా కాస్త స్వతంత్రంగా మాట్లాడితే వారిని ఇబ్బందిపెడతారనే భయాందోళనల వల్ల మాట్లాడటం లేదు కానీ... సినిమా ఇండస్ట్రీ అందరూ చంద్రబాబు క్షేమం కోరుకుంటున్నారని అన్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ స్పందించని విషయంపైనా గంటా స్పందించారు. ఇందులో భాగంగా... అది ఆయన వ్యక్తిగతమైన విషయం అని, ఆయన ఎందుకు స్పందించలేదనేది ఆయనకే తెలియాలని అన్నారు. ఈ విషయంపైనే కాదు.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు కూడా ఆయన హాజరుకాలేదని గుర్తు చేశారు.
ఇదే క్రమంలో గతంలో వేరే విషయాల్లో కూడా జూనియర్ కలిసి రావడం లేదని చెప్పిన గంట... “అది ఆయనకు పర్సనల్ గా ఏమైనా ఉండి ఉండొచ్చు. అది మనం కామెంట్ చేసే విషయం కాదు” అని వ్యాఖ్యానించారు.