టీడీపీ పొత్తుల మీద కొత్త మాట : హౌ గంటా హౌ...?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే టీడీపీ జనసేన పొత్తులు కుదిరాయని చెబుతున్నారు. ఇక ఈ పొత్తులలో సీపీఐ కూడా కలుస్తుంది అని కొత్త మాట చెప్పారు.
తెల్గుగుదేశం పార్టీ పొత్తులతోనే ఈసారి ఎన్నికలకు వెళ్తుంది అన్నది తెలిసిందే. జనసేన టీడీపీ పొత్తు అన్నది ఒక్కటి చంద్రబాబు అరెస్ట్ పుణ్యమా కన్ ఫర్మ్ అయింది. ఇక ఈ రెండు పార్టీలతో కలిసేది ఎవరు అన్న చర్చ ఉండనే ఉంది. ఇంతలో నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దాంతో రానున్న రోజులల్లో బీజేపీ కూడా ఈ పొత్తులలో భాగం అవుతుంది అని మరో చర్చ సాగుతోంది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అయితే టీడీపీ జనసేన పొత్తులు కుదిరాయని చెబుతున్నారు. ఇక ఈ పొత్తులలో సీపీఐ కూడా కలుస్తుంది అని కొత్త మాట చెప్పారు. బీజేపీ తమతో ఏ మేరకు కలసివస్తుంది అన్నది భవిష్యత్తు చెబుతుంది అని చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ జాతీయ నాయకత్వం ఏపీ రాజకీయాల మీద పొత్తుల మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కాదని అన్నారు. ఆమె మీద వైసీపీ విమర్శలు అర్ధ రహితం అంటున్నారు.
చంద్రబాబు అరెస్ట్ అన్నది తెలంగాణా ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది అని కూడా గంటా అనడం విశేషం. ఇదిలా ఉంటే టీడీపీ జనసేన కూటమిలోకి సీపీఐ రావడం ఏంటో గంటాయే చెప్పాలని అంటున్నారు. ఇప్పటిదాకా చూస్తే ఈ మాటను ఎవరూ అనలేదు. అసలు టీడీపీ అధినాయకత్వం ఈ విషయంలో ఏమీ చెప్పడంలేదు. చంద్రబాబు మాత్రమే ఈ పొత్తులు ఎత్తుల గురించి అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
అలాంటిది గంటా మాజీ మంత్రిగా ఉంటూ అత్యంత కీలకమైన పొత్తుల విషయంలో పార్టీ స్టాండ్ చెప్పారా లేక తన సొంత అభిప్రాయం చెప్పారా అన్నది చర్చకు వస్తోంది. ఇప్పటికీ టీడీపీ బీజేపీకి దూరంగా జరుగుతోందని ఇండియా కూటమి నేతలతో టచ్ లో ఉంటోందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
దానికి తగినట్లుగా గంటా సీపీఐని తెచ్చి టీడీపీలో కూటమిలో కలపడం పట్ల టీడీపీతో పాటు బీజేపీలోనూ చర్చ సాగుతోంది. అంతటితో ఆగని ఆయన జగన్ ని గద్దె దించాలని అనుకుంటున్నా పార్టీలు అన్నీ కూడా కూటమిలో చేరుతాయని అంటున్నారు. అంటే కుడి ఎడమల తేడా లేకుండా సీపీఐ బీజేపీ కూడా కూటమిలోకి వస్తే ఓకేనా అన్న మరో ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఇక పవన్ కళ్యాణ్ జనసేనకు బీజేపీ కూడా కూటమిలోకి రావాలని ఉందని అంటున్నారు. ఆయన ఈ రోజుకీ బీజేపీ కూటమిలో చేరుతుందని భావిస్తున్నట్లుగానే చెబుతున్నారు. ఇప్పటికీ జనసేన బీజేపీ అఫీషియల్ గా మిత్రులు అన్న సంగతి తెలిసిందే. అయితే తరచి చూస్తే టీడీపీ తమ్ముళ్లకు మాత్రం బీజేపీ తో పొత్తు సుతరామూ ఇష్టం లేదని ప్రచారం ఉంది. అది గంటా మాటలలో బయటపడింది అని అంటున్నారు.
ఇవన్నీ కాదు కానీ చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాతనే అన్ని విషయాల మీద క్లారిటీ వస్తుంది అని అంటున్నారు. అయితే గంటా లాంటి వారు పొత్తుల మీద ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా టీడీపీకి మేలు చేస్తున్నారా లేక చేటు చేస్తున్నారా అన్నది కూడా పార్టీలోనూ బయటా సందేహంగా ఉందని అంటున్నారు. బీజేపీ వద్దు సీపీఐ ముద్దు అని టీడీపీ అన్న మరుక్షణం ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది అందరికీ తెలిసిందే. ఇక 2019 నాటి యాంటీ సెంటిమెంట్ దెబ్బ కూడా టీడీపీకి ఉంది. అందుకే అధినాయకత్వం పెదవి విప్పడంలేదు. మరి గంటా ఎలా పొత్తుల మీద క్లారిటీ ఇస్తున్నారో అన్న మాట వినిపిస్తోంది.