మంట పుట్టిస్తున్న గంటా ...నో కౌంటర్...!

వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చిందని గంటా ట్విట్టర్ ద్వారా హాట్ కామెంట్స్ చేశారు

Update: 2023-08-03 17:12 GMT

విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తన ట్విట్టర్ ని తెగ వాడేస్తున్నరు. గడచిన కొద్ది నెలలుగా ఆయన జగన్ మీద మాటల దాడిని ఒక్కసారిగా పెంచేశారు. ఇపుడు ఆయన ట్విట్టర్ తో జగన్ మీద విమర్శలను పెద్ద ఎత్తున చేస్తున్నారు. జగన్ నిర్ణయాలను మూర్ఖమైనవిగా విమర్శిస్తున్నారు.

అమరావతి ఆర్ 5 జోన్ లో ఇళ్ళ నిర్మాణానికి హై కోర్టు బ్రేకు వేసి వైసీపీ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటి తీర్పు ఇచ్చిందని గంటా ట్విట్టర్ ద్వారా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ వి స్వార్ధపూరిత రాజకీయాలు అని మండిపడ్డారు. జగన్ రాజకీయాల కోసం అమరావతి రైతులను అడ్డం పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఆర్ 5 జోన్ అన్నది అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో ఎలక్ట్రానిక్ సిటీగా ఉందని, అలాంటి చోట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ళను నిర్మించాలనుకోవడం జగన్ మూర్ఖత్వం అని అన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ మొత్తాన్ని జగన్ ద్వంసం చేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు.

పేదల పట్ల జగన్ కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆర్ 5 జోన్ కాకుండా వేరే చోట ఇళ్లని నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. పేదల ముసుగులో అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ని ద్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని జగన్ని గద్దిస్తున్నారు.

చట్టాలు మీకు చుట్టాలు కావు అని తెలుసుకోవాలని నెత్తికెక్కిన మీ కళ్ళను కిందకు దించండి అంటూ గంటా చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి గంటా ట్విట్టర్ ద్వారా జగన్ మీద కామెంట్స్ చేయడం ఇదే ప్రధమం కాదు ఆయన చాలా తరచుగా ప్రభుత్వ విధానాల మీద మండిపడుతూ ట్విట్టర్ పిట్టకు కూత పెట్టిస్తున్నారు.

అయినా సరే గంటా కామెంట్స్ కి వైసీపీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కౌంటర్ చేయడం లేదు ఇది నిజంగా ఆసక్తికరమే. మరో నేత ఎవరైనా ఇలా మాట్లాడితే వెంటనే ప్రతి విమర్శలు చేసే వైసీపీ నేతలు గంటా విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అన్నది తెలియడంలేదు. ఇక గంటా నాలుగేళ్ళ పాటు మౌనంగా ఉండి ఇపుడు టీడీపీకి అనుకూలంగా గొంతు విప్పుతున్నారు.

అయితే ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నాయి. గంటా రాజకీయాలు ఆయన ఆలోచనలు ఎపుడూ వేరేగా ఉంటాయి. దాంతో గంటా విషయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా అన్నదే చర్చకు వస్తున్న విషయం. గంటా సీఎం ని పట్టుకుని మూర్ఖపు ఆలోచనలు అంటూ మండిపడినా వైసీపీ నుంచి నో రియాక్షన్ అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

అలాగే నెత్తి మీద కళ్ళు ఉన్నాయని కూడా గంటా అనడం కూడా హార్ష్ గానే ఉందని అంటున్నారు. మరి గంటా మీద ఒకనాడు మాటకు మాటా అంటూ మంత్రిగా ఉన్నపుడు చెలరేగిపోయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇపుడు సైలెంట్ అయిపోయారు. ఇతర నాయకులు మాట్లాడడంలేదు. మరి గంటాని ఫేస్ చేయడం ఎందుకనా లేక వేరే ప్లాన్స్ ఉన్నాయా అన్నదే అర్ధం కావడంలేదు అంటున్నారు.

Tags:    

Similar News