ఒక్క టీకా.. మూడో ప్రపంచ యుద్ధాన్ని మూడు రోజులు ఆపింది

ప్రపంచాన్ని వణికించాలంటే.. రెండింటి ద్వారానే సాధ్యం. ఒకటి వైరస్ లు, రెండు యుద్ధాలు.

Update: 2024-08-30 06:19 GMT

ప్రపంచాన్ని వణికించాలంటే.. రెండింటి ద్వారానే సాధ్యం. ఒకటి వైరస్ లు, రెండు యుద్ధాలు. ఇప్పటికే నాలుగేళ్ల కిందట కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉంటుందో చూశాం.. ఇప్పుడు రెండు యుద్ధాలను చూస్తున్నాం.. ఉక్రెయిన్-రష్యా రెండన్నరేళ్లుగా తలపడుతుండగా.. ఇజ్రాయెల్-హమాస్ పది నెలలుగా పోరాడుతున్నాయి. వీటిలో ఏదైనా మూడో ప్రపంచ యుద్ధానికి కారణం అవుతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. మరీ ముఖ్యంగా ఇరాన్, హెజ్బొల్లాల జోక్యంతో ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం అనేక మలుపులు తీసుకుంటోంది. ఇక మూడో ప్రపంచ యుద్ధమే అనేంతవరకు పరిస్థితి వచ్చింది. మరోవైపు ఇజ్రాయెల్.. గాజాతో పాటు వెస్ట్ బ్యాంక్ లోనూ దాడులకు దిగుతూ మరింత దూకుడు చూపింది. ఇంతటి ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారవు.. అనే పరిస్థితులు కనిపించాయి. కానీ..

పది నెలల పోరాటం..

నిరుడు అక్టోబరు 7న మొదలైంది ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి చొరబడి 1200 మంది ప్రాణాలను బలిగొన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతిదాడికి దిగింది. ఇప్పటివరకు కొన్ని వేల ప్రాణాలు పోయాయి. గాజా ప్రాంతం ఈ భూమ్మీద ఓ రావణ కాష్ఠంగా మారింది. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లడం తరచూ జరుగుతోంది. అయినా బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. గాజాలో బాంబు దాడులకు 3 రోజుల విరామం ఇవ్వాలని రెండు వర్గాలు అంగీకరించాయి.

భయపెట్టిన పోలియో..

ప్రపంచంలో దాదాపు అంతమైందనుకున్న పోలియో కేసు గాజాలో వెలుగుచూసింది. టీకా వేయించుకోని ఓ చిన్నారిలో పోలియో వైరస్‌ బయటపడింది. గాజాలో 25 ఏళ్లలో తొలిసారి పోలియో కేసు వెలుగుచూసింది. వైరస్ బారినపడిన యువతి పక్షవాతానికి గురైంది. దీంతో తీవ్ర ఆందోళన రేకెత్తింది. వ్యాక్సిన్ పంపిణీ కోసం మానవతా విరామానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. వచ్చే ఆదివారం నుంచి వ్యాక్సినేషన్ మొదలుకానుంది. సెంట్రల్ గాజా, దక్షిణ, ఉత్తర గాజాలోని పిల్లలకు టీకాలు వేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

6.40 లక్షల మంది పిల్లలు..

గాజాలో 6.40 లక్షల మంది పిల్లలకు తొలి విడత పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు. కాగా, ఇజ్రాయెల్‌ దాడులతో ఆరోగ్య మౌలిక సదుపాయాలు దెబ్బతిని.. పోలియో వైరస్‌ మళ్లీ పుట్టడంతో పాలస్తీనాను పోలియో మహమ్మారి ప్రాంతంగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. దక్షిణ ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలోని మురుగు నీటి నమూనాల్లో పోలియో వైరస్ కనిపించింది.

Tags:    

Similar News