అక్కడ అమ్మాయిల విషయంలో మరో దారుణం!

ఇప్పటికే హమాస్‌ కు చెందిన కీలక నేతలను, హమాస్‌ కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌ కు చెందిన ముఖ్య నేతలను ఇజ్రాయెల్‌ హతమార్చింది.

Update: 2024-08-14 16:30 GMT

పశ్చిమాసియా రక్తమోడుతూనే ఉంది. పది నెలల క్రితం ఇజ్రాయెల్‌ పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ చేసిన దాడిలో వందల సంఖ్యలో ఇజ్రాయెలీలు మృతి చెందారు. దీంతో రెచ్చిపోయిన ఆ దేశం పాలస్తీనాపై దాడులకు దిగింది. హమాస్‌లో ఒక్కరిని కూడా బతకనీయమంటూ ఘీంకరిస్తోంది. ఇప్పటికే హమాస్‌ కు చెందిన కీలక నేతలను, హమాస్‌ కు మద్దతు ఇస్తున్న ఇరాన్‌ కు చెందిన ముఖ్య నేతలను ఇజ్రాయెల్‌ హతమార్చింది.

ఇజ్రాయెల్‌ యుద్ధంతో వేలాది మంది పాలస్తీనా పౌరులు ముఖ్యంగా మహిళలు, చిన్నారులు మృత్యువాత పడ్డారు. తాగడానికి నీరు, కనీసం ఆహారం కూడా లేని పరిస్థితుల్లో అత్యంత విషమ పరిస్థితుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. ఐక్యరాజ్యసమితి, రెడ్‌ క్రాస్‌ వంటివి అందిస్తున్న వాటితోనే తమ జీవనాన్ని నెట్టుకొస్తున్నారు.

తాగడానికి నీరు, తినడానికి తిండే లభించని దుర్బర పరిస్థితుల్లో ఉన్న పాలస్తీనా ప్రజలకు ఇతర వస్తువులు అందడం లేదు. దీంతో అమ్మాయిలు తమ జుట్టును కత్తిరించేసుకుంటున్నారు. హమాస్‌ నేతల ఆదేశాలతో మహిళలు తమ జుట్టును కత్తిరించేసుకుంటున్నారని తెలుస్తోంది.

ప్రాణభయంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు అన్నట్టు జీవిస్తున్న పాలస్తీనా ప్రజలకు దువ్వెనలు, షాంపూలు, కొబ్బరి నూనెలు, శిరోజ సంక్షరణ ఉత్పత్తులు లభించడం లేదు. ఐక్యరాజ్యసమితి వంటివి నిర్వహిస్తున్న శిబిరాల్లోనూ ఇవి అందడం లేదు.

దీంతో మహిళలు తమ జుట్టును కత్తిరించేసుకుంటున్నారు. అన్నిటి కంటే దారుణం.. వారికి నెలసరి సమయంలో అవసరమైన ప్యాడ్సు కూడా అందుబాటులో లేవు. స్నానానికి, కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయి. దీంతో చర్మవ్యాధుల బారినపడుతున్నారు.

పాలస్తీనాలోని గాజాలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని అక్కడి వైద్యులు మీడియాకు వివరించారు. అక్కడి ప్రజలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇజ్రాయెల్‌ దాడుల్లో గాయపడినవారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తగిలిన దెబ్బలకు, గాయాలకు మందులు కూడా అందని దుస్థితి ఉంది. ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుంటున్న రఫాను ఇజ్రాయెల్‌ తన స్వాధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి అంతర్జాతీయ సాయం కూడా ఆగిపోయింది. అంతర్జాతీయ సంస్థలు, దేశాల నుంచి అందుతున్న సాయాన్ని ఇజ్రాయెల్‌ అడ్డుకుంటోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెబుతున్నారు. చిన్న చిన్న గాయాలకు రాసే ఆయింట్మెంట్‌ ధర 53 డాలర్లు అని చెబుతున్నారు. అయితే ఇందుకు తాము కారణమనే వాదనను ఇజ్రాయెల్‌ ఖండిస్తోంది. మానవతా సాయం పంపిణీ బాధ్యత ఐరాస, ఇతర సంస్థలదేనని చెబుతోంది.

Tags:    

Similar News