హాట్ టాపిక్... "తాడేపల్లి ప్యాలెస్ కట్టించింది నేనే"!

అవును... తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు గట్టమనేని ఆదిశేషగిరి రావు

Update: 2024-07-09 04:30 GMT

ఈ ప్రపంచంలో సోషల్ మీడియా అంటూ వచ్చిన తర్వాత వాస్తవానికి, అసత్య ప్రచారానికి మధ్య తేడా తెలుసుకోవడం చాలా కష్టమైపోతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... నిజం చెప్పులేసుకునేలోపు, అబద్ధం ఊరంతా చుట్టి వచ్చేస్తుందనే కామెంట్ తెరపైకి వస్తోంది. ఈ సమయంలో వైఎస్ జగన్ పై నిర్మాత గట్టమనేని ఆదిశేషగిరి రావు (మహేష్ బాబు చిన్నాన్న) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు గట్టమనేని ఆదిశేషగిరి రావు. ఈ సందర్భంగా జగన్ తో ఆయనకున్న అనుబంధం, సమస్య, అసలు పార్టీ నుంచి బయటకు రావడానికి గల కారణం మొదలైన విషయాలపై స్పందించారు. ఇందులో భాగంగా బయట ఉన్న ప్రచారం ఇది, అసలు వాస్తవం ఇది అనే విషయాలు వెల్లడించారు! ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇందులో భాగంగా... 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేసిన పాదయత్ర కు తానే ప్లానింగ్, డిజైన్ అని ఆదిశేషగిరి రావు తెలిపారు. తనతో జగన్ కు చాలా మంచి అనుబంధం ఉండేదని.. 2019 ఎన్నికల సమయంలో అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియలో కూడా తన పాత్ర ఉందని.. గతంలో వైఎస్సార్ ఎలాంటి గౌరవం ఇచ్చేవారో, జగన్ కూడా తనకు అంతే విలువ, గౌరవం ఇచ్చేవారని తెలిపారు.

ఇదే సమయంలో తాడేపల్లిలోని జగన్ నివాసం పైనా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఆ ప్యాలెస్ వంటి బిల్డింగ్ శేషగిరి రావే కట్టించుకున్నారని.. ఆయన తన కోసం కట్టించుకుంటే దాన్ని జగన్ లాక్కున్నారనే ప్రచారం ఉండేదని అంటారు. ఈ నేపథ్యలో ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమని చెబుతూ... అసలు జగన్ ఇంటికీ, తనకూ ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చారు శేషగిరిరావు.

ఇందులో భాగంగా... తాడేపల్లిలోని జగన్ నివాసానికి తానే ప్లాన్ చేశానని.. ఇల్లు, ఆఫీస్ డిజైన్లు ఎలా ఉండాలనేది తానే చెప్పాలని శేషగిరి రావు వెల్లడించారు. 2019 ఎన్నికలకు ముందు సమయంలో ఇది జరిగిందని.. ఆ సమయంలో అమరావతిలో స్థానికంగా నివాసం ఉండకపొతే ప్రజలు అంగీకరించకపోవచ్చని తాను చెప్పానని.. ఫలితంగా సొంతిల్లు కట్టుకోవాలని ఆయనకు సూచించినట్లు ఆదిశేషగిరి రావు వెల్లడించారు.

ఆ సమయంలో జగన్ డిజైన్ చూశారు తప్ప కనీసం ఆ స్థలం కూడా చూడలేదని అన్నారు. అన్నీ తానే దగ్గరుండి చేయించి, నిర్మాణం పూర్తి చేసి, అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చేసి జగన్ కు అప్పగించానని... దాని నిర్మాణానికి సంబంధించిన బిల్లులు అన్నీ ఆయన అప్పుడే క్లియర్ చేసేశారని.. అనంతరం జగన్ చివరిలో గృహ ప్రవేశం చేసుకున్నారని.. తాడేపల్లి ప్యాలెస్ కు తనకూ ఉన్న రిలేషన్ అదే అని ఆదిశేషగిరి రావు స్పష్టం చేశారు.

అయితే ఈ స్థాయిలో చనువుగా ఉండే తమ మధ్య గ్యాప్ రావడానికి ఒకటే ప్రధాన కారణం అని ఆదిశేషగిరి రావు చెప్పారు. ఇందులో భాగంగా... జగన్ తనను పిలిచి అద్దంకి నియోజకవర్గంలో పోటీ చేయమన్నారని.. అయితే అందుకు తాను అంగీకరించలేదని.. అదొక్కటే తమ మధ్య దూరానికి కారణం అని.. ఆదిశేషగిరి రావు క్లారిటీ ఇచ్చారు. ఇక ఒక సామాజికవర్గంపై జగన్ కు వ్యతిరేకత ఉందనే విషయంపైనా ఆయన స్పందించారు.

ఇందులో భాగంగా... ఒక సామాజికవర్గాన్ని జగన్ శతృవర్గంగా చూస్తారనే ప్రచారంపై స్పందించిన శేషగిరిరావు... తాను వైసీపీలో ఉన్నంత కాలం అలాంటిది ఏమీ లేదని, కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత అది బాగా స్ప్రెడ్ అయ్యిందని తెలిపారు. ప్రధానంగా భువనేశ్వరిపై విమర్శలు చేసినప్పుడు జగన్ ఖండించి ఉంటే వేరేగా ఉండేదని.. దాంతో అక్కడితోనే సగం డ్యామేజ్ జరిగిపోయిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆదిశేషగిరి రావు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Full View
Tags:    

Similar News