పాలకున్న విలువ మనిషి ప్రాణానికి లేదు... వీడియో వైరల్!

వివరాళ్లోకి వెళ్తే... గాజియాబాద్ లో ఢిల్లీ-మేరఠ్ ఎక్స్ ప్రెస్ వే పై ఏబీఈఎస్ కాలేజ్ సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2024-08-07 06:12 GMT

మానవత్వం మరిచిన మనుషులకు సంబంధించిన అనేక ఘటనలు ఇటీవల కాలంలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మూగజీవాలు, పక్షులు మరణించినప్పుడు, గాయపడినప్పుడు వాటికి కాపలాగా అవి చూపించే ఆప్యాయత, ఆదరణ మనిషిలో కనుమరుగైపోతున్న రోజులివి. తాజాగా జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే... మనిషిలో మానవత్వం రోజు రోజుకీ కనుమరుగైపోతుందని అనిపించక మానదు.

అవును... "మాయమైపోతున్నడమ్మా, మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు”.. అని అందెశ్రీ రాసిన మాటలు అక్షర సత్యాలు అనిపించే ఘటనలు నిత్యం కనిపిస్తూనే ఉంటున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోలపై పలువురు నెటిజన్లు సీరియస్ గా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా యూపీలో జరిగిన ఘటనపైనా ఇప్పుడు నెటిజన్లు అలానే రియాక్ట్ అవుతున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... గాజియాబాద్ లో ఢిల్లీ-మేరఠ్ ఎక్స్ ప్రెస్ వే పై ఏబీఈఎస్ కాలేజ్ సమీపంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో భాగంగా... వేగంగా వచ్చిన లారీ ఓ పాల ట్యాంకర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ ముందు భాగం నుజ్జు నుజ్జవ్వగా.. అందులోని లారీ డ్రైవర్ ప్రేమ్ సాగర్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడు ఝార్ఖండ్ కు చెందినవాడని చెబుతున్నారు.

ఇక క్లీనర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. అతడు గాయాలతో రక్తమోడుతూ అక్కడే పడి ఉన్నాడు. ఈ ప్రమాదంలో ట్యాంకర్ కూడా వెనుక భాగం దెబ్బతినడంతో అందులోని పాలు బయటకు రావడం మొదలైంది. దీంతో... అది గమనించిన స్థానికులు.. అక్కడే పడి ఉన్న డ్రైవర్ మృతదేహాన్ని, గాయపడి రక్తమోడుతున్న క్లీనర్ ని గానీ పట్టించుకోకుండా... ట్యాంకర్ నుంచి కారుతున్న పాలను పట్టుకోవడం మొదలుపెట్టారు.

ఎవరికి వారు ఎవరికి దొరికిన డబ్బాలు తెచ్చుకుని.. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పాలు పట్టుకుని వెళ్లిపోతున్నారే తప్ప కనీసం గాయపడిన క్లీనర్ కోసం అంబులెన్స్ కు కాల్ చేసే ఆలోచన కూడా చేసినట్లు కనిపించకపోవడం గమనార్హం! ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

మనిషి ప్రాణం కంటే పాలు లూటీ చేయడమే ముఖ్యమా అంటూ ఫైరవుతున్నారు. మానవత్వం మరిచారంటూ దుబ్బయడుతున్నారు. ఇక.. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. క్లీనర్ కు చికిత్స అందిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News