వైరల్ ఇష్యూ... స్కూల్ అమ్మాయి రాసిన కథే వయనాడ్ విధ్వంసమా?
ఈ నేపథ్యంలో... ఈ ఘటనపై ఓ స్కూల్ బాలిక ఏడాది క్రితమే రాసిందని.. ఆ కథ స్కూల్ మ్యాగజైన్ లో కూడా ప్రచురితమైందని.. అది తాజా వయనాడ్ పరిస్థితికి చాలా దగ్గరగా ఉందని చెబుతున్నారు.
సాధారణంగా ఏదైనా విచిత్రమైన సంఘటన జరిగితే... బ్రహ్మ గారు ఆనాడే చెప్పారు అంటూ చెబుతుంటారు చాలా మంది! ఇదే క్రమంలో దేశ విదేశాల్లోని పలువురు పేర్లను సూచిస్తూ మరికొన్ని ఘటనలను గుర్తుచేస్తుంటారు.. వాటిని వారు ముందుగానే ఊహించి, అంచనా వేసి చెప్పారని చెబుతుంటారు. అయితే వాటిని నమ్మేవారు నమ్మితే.. ఇలాంటి వాటిని చీకట్లో బాణాలని కొట్టివేసేవారూ ఉంటారు!
తాజాగా కేరళలోని వయనాడ్ లో జరిగిన విధ్వంసం గురించి తెలిసిందే. వయనాడ్ పై ప్రకృతి ప్రకోపం మిగిల్చిన ప్రాణ, ఆస్తి నష్టం పూర్తిగా అంచనా వేయడానికే ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. ఈ స్థాయిలో ప్రకృతి విలయతాండవం చేసింది.. వయనాడ్ ని విలవిల్లాడించేసింది. ఈ సమయంలో ఓ స్కూలు అమ్మాయి ఈ ఉపద్రవాన్ని ఏడాది క్రితమే తాను రాసిన కథలో పేర్కొందని అంటున్నారు.
అవును... ప్రస్తుతం దేశవ్యాప్తంగా వయనాడ్ విధ్వంసం గురించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ ప్రకృతి ప్రకోపం వల్ల జరిగిన నష్టంపై ఓ క్లారిటీకి రాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ఈ ఘటనపై ఓ స్కూల్ బాలిక ఏడాది క్రితమే రాసిందని.. ఆ కథ స్కూల్ మ్యాగజైన్ లో కూడా ప్రచురితమైందని.. అది తాజా వయనాడ్ పరిస్థితికి చాలా దగ్గరగా ఉందని చెబుతున్నారు.
కాకపోతే... స్కూల్ మ్యాగజైన్ లో ప్రచురితమైన ఆ బాలిక రాసిన కథ సుఖాంతం కాగా, తాజాగా వాస్తవంలో జరిగిన ఘటన మాత్రం తీవ్ర విషాదంగా మారిన పరిస్థితి. ఇక ఈ కథ విషయానికొస్తే... వయనాడ్ లోని గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న లయ అనే విద్యార్థిని... జలపాతంలో మునిగిపోయే అమ్మాయి గురించి రాసింది. ఈ కథలో ఆ అమ్మాయి ఆ నీటిలో మునిగి చనిపోతుంది!
అయితే... అలా మరణించిన తర్వాత ఆమె పక్షిరూపంలో గ్రామానికి తిరిగి వస్తుంది. అలా తిరిగివచ్చిన పక్షి.. ఆ ఊరి పిల్లలతో మాట్లాడింది. ఇందులో భాగంగా... ఆ ఊరి నుంచి పారిపోవాలని, ఇక్కడ పెద్ద ప్రమాదం జరగబోతోందని హెచ్చరించింది. ఈ పక్షి హెచ్చరికల అనంతరం వాళ్లు వెనక్కి తిరిగి చూసే సరికి కొండపై నుంచి వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తోంది.
అలా ఊరిలోని పిల్లలను హెచ్చరించిన పక్షి.. అనంతరం అమ్మాయిగా మారుతుంది. అంటే... లయ రాసిన కథలో రాబోతున్న ప్రమాదం గురించిన హెచ్చరికలు అందుతాయి.. ఊరి జనం రక్షించబడటంతో కథ సుఖాంతం అవుతుంది! కానీ.. తాజాగా వయనాడ్ లో జరిగిన వాస్తవ ఘటన మాత్రం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది!
కాగా... కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే. అనవర్ సాదత్ సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ను షేర్ చేయగా.. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది!