డేంజర్ బెల్స్: గ్లోబల్ వార్మింగ్ కాదు.. గ్లోబల్ బాయిలింగ్!
గ్లోబల్ బాయిలింగ్ శకం మొదలైందని భూమి విధ్వంసక స్థితికి చేరుకొందని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొనడం కొసమెరుపు.
భూ వాతావరణం ఏడెక్కి పోతోంది.. దృవాల వద్ద మంచుకరుగుతోంది.. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భూతాపం కారణంగా వడగల్ల వర్షాలు కురుస్తున్నాయని నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయం లో ప్రస్తుతం భూమి వేడీ రికార్డ్ స్థాయి లో ఉందని.. ముందు ముందు పరిస్థితి మరింత ఘోరంగా ఉండబోతోందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు!
అవును... లక్ష సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా వేడి వాతావరణం గత మూడు వారాల్లో నమోదైందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ప్రపంచవ్యాప్తంగా గాలి ఉష్ణోగ్రతల ను సేకరించి ఈ రికార్డుల ను తయారు చేశారు. ఈ ఏడాది జులై 23 తేదీ నాటికి సగటున 16.95 డిగ్రీల సెల్సియస్ గా ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 2019 జులైలో నమోదైన 16.93 రికార్డు కంటే ఎక్కువ.
దీంతో కోపర్నికస్ సంస్థ లోని చాలా మంది శాస్త్రవేత్తలు గత 1,20,000 ఏళ్లలోనే ఈ నెల ను వేడి నెలగా చెబుతున్నారు. ఇదే సమయం లో ఇవి మానవ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు అని కోపర్నికస్ సంస్థ డిప్యూటి డైరెక్టర్ సమంత బర్గెస్ పేర్కొన్నారు. దాదాపు 1940 నుంచి ఈ డేటా ను సేకరిస్తున్నారట.
ఈ ఏడాది జూన్ లో కూడా ఎండలు మండిపోయాయి. చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత ఈ నెల 6వ తేదీన నమోదైంది. నాడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.08 డిగ్రీల సెల్సియస్. ఇది చరిత్రలోనే అత్యధికం. వాస్తవానికి ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.
అంతకంటే ముందు... ఈ ఏడాది మే నెల లో సముద్ర ఉపరితలం పై వేడి కూడా అసాధరణ స్థాయి లో నమోదైంది. భవిష్యత్తులో ఈ ఉష్ణోగ్రతలను మించి నమోదయ్యే ప్రమాదం ఉందని బ్రౌన్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త కిమ్ కాబ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా... రానున్న దశాబ్దంతో పోల్చుకొంటే ఇది కొంత చల్లటి సంవత్సరంగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావచ్చని చెప్పడం గమనార్హం.
ఇదే సమయం లో గ్లోబల్ వార్మింగ్ శకం ముగిసిందని.. గ్లోబల్ బాయిలింగ్ శకం మొదలైందని భూమి విధ్వంసక స్థితికి చేరుకొందని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ పేర్కొనడం కొసమెరుపు.