దిగిరావే బంగారం : వరుసగా 8వ రోజూ ఎగబాకిన పసిడి
గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. శుక్రవారం మార్కెట్లు క్లోజ్ అయ్యే టైంకి ఆల్ టైం హైకి చేరుకున్నాయి.
గోల్డ్ రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. శుక్రవారం మార్కెట్లు క్లోజ్ అయ్యే టైంకి ఆల్ టైం హైకి చేరుకున్నాయి. వరుసగా 8వ రోజూ ధర పెరగడంతో 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారం ధర పది గ్రాములు రూ.83,100కు చేరుకుంది. బంగారం ధర రూ.83,000 చేరడం ఇదే తొలిసారి.
పెరగడమే కానీ, తరగడమనేది బంగారం ధరల్లో కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ సరికొత్త రికార్డులను చేరుకుంటూనే ఉంది. తాజాగా ఆల్ టైం హైకి చేరుకుని సగటు వినియోగదారులకు అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. శుక్రవారం గ్రాము బంగారానికి రూ.200 పెరిగింది. దీంతో 99.9 స్వచ్ఛత ఉన్న బంగారం రూ.83,100, 99.5 శాతం ఉన్న బంగారం 82,700 చేరింది.
ఇక పసిడి ధర ఎగిరెగిరి పడుతుండటంతో వెండి కూడా అదే దారిలో పయనించింది. కిలో వెండి ధర రూ.500 పెరిగి 94,000 చేరింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత బులియన్ మార్కెట్ జెట్ స్పీడుతో పరుగులు తీస్తోంది. సుంకాలు, వాణిజ్య విధానాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి పెరగింది. ఈ పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు బులియన్ మార్కెట్ ను ఆశ్రయిస్తున్నారు. దీంతో గోల్డ్ కు క్రేజ్ పెరుగుతోందని బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అంతర్జాతీయ కమోడిటిస్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) ఒక దశలో 15.50 డాలర్ల పెరిగి 2,780.50 డాలర్లకు చేరింది. వెండి సైతం 1.53 శాతం ఎగబాకి 31.32 డాలర్లకు చేరింది. ఇక ఢిల్లీలో శనివారం ఉదయం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,710 వద్ద ట్రేడ్ అవుతోంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 82,580 వద్ద మొదలైంది. అదేవిధంగా హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కిలో వెండి లక్ష మార్కును దాటేసింది. ప్రస్తుతం ఈ నగరాల్లో వెండి కిలో రూ.1,05,100 ఉంది. ఈ రోజు ఉదయమే వంద రూపాయులు పెరిగింది.