టీడీపీకి గొల్లపల్లి రాజీనామా... తలలు పట్టుకున్న జనసైనికులు!
ఈ క్రమంలో తాజాగా రెండు పార్టీలూ తమ తమ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచీ అటు జనసేనలోనూ, ఇటు టీడీపీలోనూ అసంతృప్తుల ప్రకంపనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి.
టీడీపీ - జనసేన పొత్తు ప్రభావం రెండు పార్టీలపైనా బలంగా పడుతున్నట్లుగానే ఉంది. ఈ క్రమంలో తాజాగా రెండు పార్టీలూ తమ తమ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించినప్పటి నుంచీ అటు జనసేనలోనూ, ఇటు టీడీపీలోనూ అసంతృప్తుల ప్రకంపనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో... ప్రధానంగా టీడీపీ పరిస్థితి.. “కొండ నాలుకకు మందేస్తే, ఉన్న నాలుక ఊడిందన్నట్లు ఉంది” అన్నట్లుగా మారిందనే కామెంట్లూ తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు.
అవును... టీడీపీ - జనసేన పొత్తు వల్ల ఇరు పార్టీలకూ కలిగే ప్రయోజనం సంగతీ కాసేపు పక్కనపెడితే... గ్రౌండ్ లెవెల్ లో నష్టం మాత్రం కన్ ఫాం అనే చర్చ బలంగా సాగుతున్న నేపథ్యంలో... మాజీ మంత్రి, టీడీపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, కోనసీమలోని కీలక నేత గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన ఆగ్రహాన్ని ఆవేదనగా చెబుతున్నట్లుగా చంద్రబాబుకు ఒక లేఖ రాశారు!
ఇందులో భాగంగా... 1981 నుంచి కొత్తపేట సమితి అధ్యక్షునిగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఎన్టీఆర్, వైఎస్సార్ ల కేబినెట్ లో రెండు సార్లు మంత్రిగా పనిచేసిన విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేశారు గొల్లపల్లి. ఇదే సమయంలో 2014, 2019 ఎన్నికల్లోనూ పార్టీకి కానీ, చంద్రబాబుకి కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించలేదనే విషయాన్ని తన లేఖలో సూటిగా స్పష్టం చేశారు.
ఇక ఇటీవల 94 మందితో ప్రకటించిన తొలిజాబితాలో తనకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ.. తన పేరు ప్రకటించలేదని నొక్కి చెప్పిన గొల్లపల్లి... తన ఆత్మగౌరవానికి భంగం కలిగిన నేపథ్యంలో పార్టీలో కొనసాగలేనని తెగేసి చెప్పారు. ఈ క్రమంలో తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. దీంతో ఈ విషయం టీడీపీలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అంతకంటే ప్రధానంగా... కోనసీమ జిల్లాలోని రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లో మరింత హాట్ టాపిక్ గా మారింది.
టీడీపీ - జనసేనలకు ఉమ్మడి దెబ్బ!:
గొల్లపల్లి సూర్యారావు తాజాగా టీడీపీకి రాజీనామా చేయడం ఆ పార్టీతో పాటు జనసేనకు కూడా బిగ్ షాక్ అనే చెప్పాలి. కారణం... రాపాక వైసీపీలోకి వచ్చేసిన నేపథ్యంలో... వచ్చే ఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా గొల్లపల్లికి ఉన్న ఫాలోయింగ్ పై జనసేన బాగా హోప్స్ పెట్టుకుందని అంటున్నారు. ఈ సమయంలో ఆయన సైకిల్ దిగిపోవడంతో... గ్లాసుకు పగుళ్లు వచ్చాయనే చర్చ నియోజకవర్గంలో అప్పుడే మొదలైపోయింది.
ఇదే సమయంలో పి.గన్నవరం నియోజకవర్గంలో అయినా గొల్లపల్లికి టిక్కెట్ ఇస్తే... అప్పుడు కూటమికి రెండు నియోజకవర్గాల్లోనూ ప్లస్ అయ్యేదనే చర్చా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో చినబాబు ప్రొత్సాహంతో మహాసేన రాజేష్ కు చంద్రబాబు పి.గన్నవరం టిక్కెట్ కేటాయించారు. దీంతో అక్కడ జనసేన కార్యకర్తలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.
ఈ నేపథ్యంలో గొల్లపల్లి టీడీపీకి రాజీనామా చేయడంతో రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని అటు టీడీపీ నేతలు, ఇటు జనసేన కార్యకర్తలు తలలు పట్టుకున్నారని తెలుస్తుంది. ఏది ఏమైనా... కోనసీమ జిల్లాలో టీడీపీకి ఇది పెద్ద దెబ్బే అనేది విశ్లేషకులతో పాటు సామాన్యుల మాట కూడా!!