పట్టించుకోకపోవడంతో పాల్వాయి గుడ్ బై

కాంగ్రెస్ కు రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో.. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

Update: 2023-11-11 09:21 GMT

ఎన్నికల వేళ మరో కీలక నాయకురాలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. టికెట్ దక్కలేదని అసమ్మతి వ్యక్తం చేసినప్పటికీ ఆమెను ఎవరూ పట్టించుకోకపోవడంతో చివరకు పార్టీని వీడారు. ఆమెనే పాల్వాయి స్రవంతి. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చిన స్రవంతి ఇప్పుడు హస్తానికి దూరమయ్యారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడంతో.. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన స్రవంతి ఓటమి పాలయ్యారు.

అయితే తాజాగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మరోసారి మునుగోడు నుంచి పోటీ చేయాలని స్రవంతి అనుకున్నారు. అందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ బీజేపీ నుంచి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే మరోసారి హస్తం పార్టీ సీటు కేటాయించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె.. పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలక బూనారు. పార్టీని వీడేముందు బహిరంగ చర్చ కూడా పెట్టారు. కానీ కాంగ్రెస్ నేతలెవరూ ఆమెను పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఏ అగ్ర నాయకుడూ స్రవంతితో మాట్లాడలేదని తెలిసింది.

దీంతో లాభం లేదని భావించిన స్రవంతి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. ముందుగా ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆమె బీఆర్ఎస్ లో చేరబోతున్నారని టాక్. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగానే తనను కొందరు ఓడించారని స్రవంతి విమర్శించారు. దీంతో తన ఓటమికి కాంగ్రెస్ కారణమని ఆమె చెప్పకనే చెప్పారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News