కొత్త స్నేహం: కేసీఆర్ అభిమానిస్తే అలానే ఉంటుంది!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఇద్దరు మనుషులు అంటారని ఆయన్ను బాగా తెలిసిన వారు చెబుతుంటారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఇద్దరు మనుషులు అంటారని ఆయన్ను బాగా తెలిసిన వారు చెబుతుంటారు. ప్రేమ.. అభిమానంతో ఉన్నప్పుడు ఎంతలా ఆదరిస్తారో.. లెక్కలో కాస్త తేడా వచ్చినా ఆయన్ను భరించటం చాలా కష్టమంటుంటారు. అందుకే.. చాలామంది ఆయనతో స్నేహంగా ఉండటానికే ఇష్టపడతారు కానీ.. ఆయనతో గొడవ పెట్టుకోవటానికి నో అనేస్తుంటారు. కారణం ఏమైనా కానీ.. మొన్నటివరకు ఉప్పు.. నిప్పులా ఉన్న రాష్ట్ర గవర్నర్ తమిళ సైకు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య సఖ్యతో చోటు చేసుకుంది.
ఢిల్లీ స్థాయిలో వచ్చిన మార్పుల ప్రభావం.. రాజ్ భవన్ మీదా.. గవర్నర్ కు ఇచ్చే రెస్పెక్టు మీద బాగానే ప్రభావం చూపిందంటున్నారు. ఇంతకాలం కేసీఆర్ కోపాన్ని.. ఆగ్రహాన్ని మాత్రమే చూసిన.. గవర్నర్ తమిళ సైకు.. గడిచిన రెండు.. మూడు రోజులుగా అందుకు భిన్నమైన కేసీఆర్ ను ఆమెను చూస్తున్న పరిస్థితి. మొన్నామధ్య అంగరంగ వైభవంగా ప్రారంభించిన సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానపత్రికను సైతం పంపని సీఎం.. తాజాగా అందుకు భిన్నమైన తీరును ప్రదర్శించారు.
కొత్త సచివాలయంలో ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న నల్లపోచమ్మ ఆలయాన్ని.. మసీదు.. చర్చిలను గవర్నర్ తో కలిసి ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆలయంలో జరిగిన తొలి పూజలు.. మసీదు.. చర్చిల్లో నిర్వహించిన తొలి ప్రార్థనల్లో ఇరువురు ప్రముఖులు కలిసి పాల్గొనటం ఆసక్తికరంగా మారింది. మొన్నటి వరకు సూటిపోటి మాటలు.. సంచలన వ్యాఖ్యలు మాత్రమే ఇద్దరిమధ్య నడిచేవి. అందుకు భిన్నంగా ఇరువురు స్నేహపూర్వక వాతావరణంలో అభిమానాన్ని.. గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకున్న వైనం ఆసక్తికర చర్చకు తెర తీసిందన్న మాట వినిపిస్తోంది.
చర్చలో నిర్వహించిన తొలి ప్రార్థనల వేళలో.. గులాబీ కేక్ ను గవర్నర్ చేత దగ్గరుండి కట్ చేయించారు సీఎం కేసీఆర్. ఇప్పటివరకు కేసీఆర్ ఆగ్రహాన్ని మాత్రమే చూసిన గవర్నర్ కు.. తనతో స్నేహం ఎంత బాగుంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేశారన్న మాట వినిపిస్తోంది. సచివాలయానికి చేరుకున్న గవర్నర్ తమిళ సైకు మేళతాళాల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇతర ఉన్నతాధికారులు ఎదురెళ్లి స్వాగతం పలకటం గమనార్హం.
కొత్త సచివాలయాన్ని గవర్నర్ కు తానే చూపించారు ముఖ్యమంత్రి. సచివాలయం ప్రారంభమై చాలాకాలమే అయినా.. ఇప్పటివరకు అడుగు పెట్టని వైనం తెలిసిందే. దేవాలయం.. చర్చి.. మసీదుల్లో పూజలు.. ప్రార్థనలు ముగిసిన తర్వాత.. సచివాలయాన్ని చూడాల్సిందిగా కోరిన కేసీఆర్.. గవర్నర్ కు తాను స్వయంగా చూపిస్తూ వివరించారు. ఏమైనా.. తాజా సచివాలయ సందర్శన గవర్నర్ కు సరికొత్త అనుభవాన్ని మిగిల్చిందని మాత్రం చెప్పక తప్పదు.