స్వామీ ఏమిటిది ...పీఠం కదులుతోందా ?
స్వామీజీ విశాఖలోని పెందుర్తి వద్ద ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం శ్రీ శారదాపీఠం పేరుతో ఆధ్యాత్మిక స్థావరాన్ని నిర్మించారు.;
విశాఖలో స్వామిజీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ప్రముఖుడిగా పేరు గడించారు. ఆయన వద్దకు వచ్చే వారిలో రాజకీయ భక్తులు ఎక్కువగా ఉంటారని ప్రతీతి. స్వామీజీ విశాఖలోని పెందుర్తి వద్ద ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం శ్రీ శారదాపీఠం పేరుతో ఆధ్యాత్మిక స్థావరాన్ని నిర్మించారు. అక్కడ నుంచే ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానం మొదలైంది.
ఇక దేశాన్ని ఏలే వారి నుంచి ఎంతో మంది శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన వారే. ఇంతింతై అన్నట్లుగా పీఠం ఎంతో విస్తరించింది. హైదరబాద్ లో కూడా పీఠం ఏర్పాటు అయింది. ఉత్తరాదీ రుషీకేశ్ లో కూడా పీఠం ఉంది. ఇదిలా ఉంటే ఏపీలో అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం హయాంలో శారదాపీఠం ఒక వెలుగు వెలిగింది అని చెబుతారు. వార్షిక ఉత్సవాలకు ముఖ్యమంత్రి హోదాలో జగన్ తప్పనిసరిగా వచ్చేవారు. ఆయన చేత రాజశ్యామల హోమం వంటివి స్వామీజీ చేయించేవారు.
ఇక భీమిలీ వద్ద పీఠం వేద పాఠశాల కోసం వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున భూమిని అందించింది. దీని మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుని ప్రభుత్వం పరం చేసింది. తిరుమలలో పీఠం తరఫున నిర్మాణాలను కూడా కూల్చేందుకు టీటీడీ చట్టబద్ధమైన చర్యలు తీసుకుంది.
ఈ నేపథ్యంలో ఇపుడు విశాఖలో ఉన్న శ్రీ శారదాపీఠం మీద కూడా చర్యలకు రంగం సిద్ధం అవుతోంది అని అంటున్నారు. ప్రభుత్వ భూములలో ఉన్న శ్రీ శారదా పీఠాన్ని వెంటనే తొలగించాలని పెందుర్తికి చెందిన తహశీల్దార్ తాజాగా నోటీసులు జారీ చేయడంతో ఇది అతి పెద్ద చర్చకు తావిస్తోంది.
చినముషిడివాడ సర్వే నంబర్ 90లో ప్రభుత్వానికి చెందిన 72 సెంట్లో పోరంబోకు రాస్తాలో 22 సెంట్ల భూమిని ఆక్రమించారు అని శారదాపీఠం మీద అభియోగం మోపుతూ ఈ నోటీసులు జారీ చేశారని అంటున్నారు. అందువల్ల ఏడు రోజుల వ్యవధిలోపల ఈ ఆక్రమిత భూముల్లోని నిర్మాణాలను తొలగించాలని స్పష్టం చేశారు.
దీంతో ఏమి జరుగుతుంది అన్న చర్చ అంతటా సాగుతోంది. శ్రీ శారదా పీఠాన్ని తొంబై దశకంలో ప్రారంభించారు. మొదట చిన్నగా ఉన్న ఈ పీఠం ఆ తరువాత బాగా విస్తరించింది. అన్ని రకాలైన సదుపాయాలతో ఆస్తిక జనులకు ఆశ్రమంగా మారింది. వీవీఐపీలు ఎంతో మంది పీఠాన్ని సందర్శిస్స్తూ వచ్చారు. దాంతో ఈ పీఠం విషయంలో ఇలాంటి అభియోగాలు రావడంతో ఏమిటిది అని అంతా ఆలోచిస్తున్నారు
నిజంగా ఆక్రమణలు ఉంటే తొలగించాల్సిందే అన్న మాట వైపు ఉంటే ఏనాడో కట్టిన నిర్మాణాల మీద ఇపుడు నోటీసులు అన్నది మరో వాదనగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చాక స్వామీజీ ఏపీ నుంచి దూరంగా ఉంటున్నారు ఆయన ఉత్తరాదిన రుషీకేశ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. దీని మీద పీఠం నిర్వాహకులు ఏమి చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.