సీఎం బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వొచ్చా: సుప్రీంకోర్టు కీ కామెంట్స్‌!

సాధారణంగా అధికారంలో ఎవరు ఉంటే వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకే ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కుతుంటాయి

Update: 2023-10-25 05:48 GMT

సాధారణంగా అధికారంలో ఎవరు ఉంటే వారి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులకే ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కుతుంటాయి. ఇప్పుడు ఇదే విషయంలో సుప్రీంకోర్టుకు ధర్మ సందేహం తలెత్తింది. ఒక ముఖ్యమంత్రి దగ్గరి బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు కట్టబెట్టొచ్చా? ఒకవేళ అలాచేస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి? అని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ కు చెందిన ఓ కేసులో జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టొచ్చో, లేదో అభిప్రాయాన్ని తెలపాలని కాగ్‌ ను కోరింది.

రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ అధినేతగా ముఖ్యమంత్రి ఉంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి బంధువులకు ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టొచ్చా? ఒకవేళ ఇవ్వొచ్చని చెబితే, అలాంటి వ్యక్తులకు కాంట్రాక్టులు అప్పగించేటప్పుడు ఎలాంటి నియమనిబంధనలు పాటించాలి? అని సుప్రీంకోర్టు.. కాగ్‌ అభిప్రాయాన్ని అడిగింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వం ఎలాంటి టెండర్లు లేకుండా సీఎం సన్నిహితులకు కాంట్రాక్టులు కట్టబెట్టింది. దీన్ని సవాల్‌ చేస్తూ అరుణాచల్‌ సేన అనే స్వచ్ఛంద సంస్థ అసోంలోని గువహటి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

అయితే అరుణాచల్‌ సేన దాఖలు చేసిన పిల్‌ ను 2007లో గువాహటి హైకోర్టు కొట్టేసింది. దీంతో 2010లో దాన్ని సుప్రీంకోర్టులో అరుణాచల్‌ సేన సవాల్‌ చేసింది.

కాగా కాగ్‌ ను అడిగిన ప్రశ్నలు రెండూ ఊహాజనితంగా ఉన్నాయని ఆ రాష్ట్ర సీఎం పెమా ఖండూ తరఫు సీనియర్‌ న్యాయవాదులు రాజీవ్‌ దత్తా, వికాస్‌ సింగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సుప్రీం కోర్టు సీఎం న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఊహాజనితం అనుకుంటే అనుకోవాలని వ్యాఖ్యానించింది. తాము ఈ రెండు అంశాలపై కాగ్‌ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం తేల్చిచెప్పింది.

Tags:    

Similar News