ప్రభుత్వ ఉద్యోగులకు మంట పుట్టే నిజం బయటకు!
గతానికి భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉంది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం గతంలో ఒకటో తారీఖు జీతాలు వచ్చేసేవి.
గతానికి భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఉంది. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం గతంలో ఒకటో తారీఖు జీతాలు వచ్చేసేవి. ఒకవేళ ఆదివారం అయితే.. రెండో తారీఖు..కొన్ని సందర్భాల్లోకాసింత ముందు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ.. కొన్నేళ్లుగా అలాంటి పరిస్థితులు లేవు. ఆ మాటకు వస్తే.. ఒకటి కాదు మొదటి వారంలో జీతాలు వచ్చినా అదే పది వేలు అనుకునే పరిస్థితి. కొన్ని సందర్భాల్లో రెండో వారంలోకానీ జీతాలు రాని పరిస్థితి.
పేరుకు ధనిక.. సంపన్న రాష్ట్రమన్న మాటే కానీ.. జీతాల విషయానికి వస్తే.. దశల వారీగా జీతాలువేయటం అప్పుడప్పుడు చూస్తున్నదే. ఈ విషయంపై ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా జరుగుతున్న ఎన్నికల వేళ ఆసక్తికర నిజం ఒకటి బయటకు వచ్చింది. దాని సారాంశం ఏమంటే.. అసెంబ్లీ సభ్యులకు (అదేనండి ఎమ్మెల్యేలకు) జీతాలు ఠంఛన్ గా ఒకటో తేదీన వస్తున్న విషయం బయటకు వెల్లడైంది.
అది కూడా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. శాసనసభ సభ్యులకు ప్రతి నెల ఒకటోతేదీన జీతాలు అందుతున్నాయి. వారికి.. ఒక రోజు కూడా ఆలస్యం కాకుండా వస్తున్నట్లు పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాకు చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త సురేశ్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన అధికారులు.. ఎమ్మెల్యేల జీతాల్ని నెల మొదటి రోజున ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదంతా చూసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు మంట పుట్టక మానదు.