గుడివాడతో గడబిడ తప్పదా ?
వైసీపీ విశాఖ జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి అప్పగించింది.
వైసీపీ విశాఖ జిల్లా బాధ్యతలను మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి అప్పగించింది. జగన్ విశాఖ జిల్లా పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న కోలా గురువులుని తప్పించి ఆయనకు ఈ కిరీటం పెట్టారు. విశాఖ జిల్లాలో కాపులు ఎక్కువ కాబట్టి అలా ప్రయారిటీ ఇచ్చారు అనుకున్నా గుడివాడ అమర్నాథ్ కి ఎంత మంది సహకరిస్తారు అన్నది చర్చగా ఉంది.
ఎందుకంటే అమర్నాథ్ వైఖరితో భీమిలీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి పొసగదు అని అంటున్నారు. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే ఆయనే పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతలు కోరుకున్నారు అని కూడా అంటారు మరి ఆయనకు కాకుండా అమర్నాథ్ కి ఇవ్వడం ఏంటి అంటే ఆయన యువకుడు దూకుడు చేస్తారు అని జగన్ నమ్ముతున్నారు
అయితే అమర్నాథ్ నేతలను ఎవరికీ కలుపుకుని పోరు అన్న విమర్శలు ఉన్నాయి. ఆయనకు 2014 నుంచి 2019 దాకా కూడా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే సీనియర్ నేతలు చాలా మంది ఆయనతో పడలేక పార్టీని వీడిపోయారు అని కూడా ప్రచారంలో ఉంది.
మరో వైపు చూస్తే ఇపుడు పార్టీ కష్టకాలంలో ఉంది. దంతో పాటు పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉన్నారు. వారందరినీ కాపాడుకోవాల్సి ఉంది. మరి గుడివాడ అయితే ఆ విధంగా వ్యవహరించగలరా అన్నది కూడా చూడాలని అంటున్నారు.
అయితే వైసీపీలో చాలా మంది నేతలు స్తబ్దుగా ఉంటున్నారు. దాంతో ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నా ఏముందిలే అన్న నిర్వేదం కూడా ఉంది. పైగా ప్రతిపక్షంలో పార్టీ ఉంది. వచ్చే ఏడాది నుంచి జనంలోకి రావాలి. ఉద్యమాలు పెద్ద ఎత్తున చేయాలి.అధికార కూటమికి ఎదురు నిలవాలి. దాంతో కూడా చాలా మంది ఎందుకొచ్చిన తలనొప్పి అని భావిస్తున్నారు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే ఈ రోజు పార్టీ పదవి తీసుకుని కూటమికి ఎదురు వెళ్తే రేపటి రోజున ఆ వైపునకు వెళ్లాలీ అంటే కూడా ఇబ్బంది అవుతుంది అన్న ముందు చూపు కలిగిన వారు కూడా ఉన్నారు. ఇక గుడివాడ ప్రెసిడెంట్ అయ్యారు. పార్టీ ఆఫీసు చూస్తే ఊరికి దూరంగా కట్టారు. దాంతో సిటీలో ఆఫీసు తీసుకుని ఆయన మొత్తం నిర్వహణ భారం చూసుకోవాలి. 2026లో వచ్చే స్థానిక ఎన్నికలకు పార్టీని ప్రిపేర్ చేయాలి. పార్టీలో నేతలను కదిలించాలి. ఇవన్నీ ఆయన ముందున్న టాస్కులు. మీడియా ముందు అయితే గుడివాడ బాగా మాట్లాడుతారు కానీ గ్రౌండ్ ఏదీ అన్నది కూడా చర్చగా ఉందిట. చూడాలి మరి గుడివాడ గడబిడ సొంత పార్టీకా లేక కూటమికా అన్నది.