పెట్రోల్ ప్యాకెట్లతో దాడి కేసు... గుడివాడలో 9 మంది వైసీపీ నేతల అరెస్ట్!

కృష్ణాజిల్లా గుడివాడలో తొమ్మిది మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు! 2022 డిసెంబర్ 25న జరిగిన పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది

Update: 2024-12-04 08:31 GMT

కృష్ణాజిల్లా గుడివాడలో తొమ్మిది మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు! 2022 డిసెంబర్ 25న జరిగిన పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే... ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళితో పాటు నీరుడు ప్రసాద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారని అంటున్నారు.

అవును... కృష్ణాజిల్లా గుడివాడలో తొమ్మిది మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయినవారిలో రాపాక పవన్ కుమార్, కొండ్రు శ్రీకాంత్, మొరుగుమాల ఉదయ్ కుమార్, సుంకర సతీశ్, నీరుడు భార్గవ్, రాజబోయిన తాండవ కృష్ణ, గొంటి అశోక్, పండేటి మోషే, గొల్ల వెంకటేశ్వర రావు ఉన్నారని అంటున్నారు.

వీరిని పెదపారుపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (బీ.ఎన్.ఎస్.) 143, 144, 188, 427, 506, రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న కాళీ.. అస్సాం రాష్ట్రంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారని.. ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపట్టారని అంటున్నారు!

కాగా... వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యాలయాలపై వైసీపీ నేతల దాడులకు సంబంధించిన వ్యవహారాలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసుపైనా పోలీసులు సీరియస్ గా దృష్టి సారించిన పరిస్థితి.

ఈ నేపథ్యంలోనే 2022 డిసెంబర్ 25న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర రావు వస్త్ర దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేసి అరాచకం సృష్టించిన కేసుపైనా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన 9 మందిని అరెస్ట్ చేశారు! పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారని అంటున్నారు!

Tags:    

Similar News