పాపం పవన్ కళ్యాణ్.. గుడివాడ ఆయన మీద పడ్డారేంటి...?
అంతే కాదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ముందుకు తెచ్చి గట్టిగా టార్గెట్ చేసేవారు.
వైసీపీకి చెందిన యువ మంత్రి గుడివాడ అమరనాధ్ మాట్లాడితే చాలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద గట్టిగా విరుచుకుని పడిపోయేవారు. పవన్ కళ్యాణ్ ని పట్టుకుని ప్యాకేజ్ స్టార్ అంటూ ర్యాగింగ్ చేసేవారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా ముందుకు తెచ్చి గట్టిగా టార్గెట్ చేసేవారు.
అలాంటి మంత్రి గుడివాడ టోన్ ఇపుడు మారుతోందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆయన కొంతకాలంగా పవన్ మీద ఏమీ మాట్లాడటం లేదు. నిజానికి జనసైనికులకు గుడివాడ అమరనాధ్ అంటే మంటగా ఉండేది. తమ నాయకుడు పవన్ ని పట్టుకుని మంత్రి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అని వారు ఫైర్ అయ్యేవారు.
అలాగే పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ నుంచి కొందరు మంత్రులను కీలక నేతలను టార్గెట్ చేసేవారు. వారిలో గుడివాడ కూడా ఒకరు అన్నది తెలిసిందే. మరి ఇంతలా మాటల వార్ సాగిన గుడివాడ వర్సెస్ పవన్ అన్నది ఉన్నట్టుండి కొంతకాలంగా ఆగిపోయింది.
ఏమిటో ఈ రాజకీయం అని అంతా అనుకుంటున్న వేళ పవన్ అంటే మంటెత్తిపోయే గుడివాడ నోట పాపం పవన్ కళ్యాణ్ అని వస్తోంది. ఇది నిజంగా చిత్రంగానే ఉంది అని అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన గుడివాడ అమరనాధ్ తమ మాటలను వాడిని వేడిని అన్నీ కలపి నాదెండ్ల మనోహర్ మీద బాణాలుగా సంధించారు.
జనసేనకు కట్టప్పలా మనోహర్ తయారు అయ్యారని కొత్త పేరు పెట్టి మరీ ఆయన్ని గుచ్చేశారు. అమాయకుడు పవన్ అన్నారు. పవన్ని తప్పుదోవ పట్టిసోంది నాదెండ్ల మనోహరే అని కూడా ఆరోపించారు. ఆయన రక్తంలోనే వెన్నుపోటు తత్వం ఉంది అని అన్నారు. సీనియర్ నాదెండ్ల ఆయన తండ్రి భాస్కరరావు ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచారు అని గుర్తు చేశారు.
ఇపుడు కట్టప్పలా మారి జనసేనలో జూనియర్ నాదెండ్ల అలాగే చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గుడివాడ పవన్ ని వదిలేసి మనోహర్ మీదకు ఎందుకు దండెత్తుతున్నారు అన్నదే పెద్ద ప్రశ్న. దానికి రీజన్స్ బోలెడు ఉన్నాయని అంటున్నారు. ఎలా అంటే జనసేన టీడీపీ పొత్తు తరువాత జనసైనికుల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి రాజుకుంది అని అంటున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో కీలక నేతలు రాజీనామాలు చేశారు కూడా.
ఉన్న వారు కూడా లోపల రగులుతున్నారు. ఇదంతా నాదెండ్ల మనోహర్ చేస్తున్నారు అని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వారు ఆరోపిస్తున్నారు. నాదెండ్ల జనసేన పార్టీని రాంగ్ డ్రైవింగ్ తో అలా ముందుకు తీసుకెళ్తున్నారు అని చాలా మంది నేతలు విమర్శించారు. దాంతో గుడివాడ తన రాజకీయ చతురతతో నాదెండ్ల మీద బాణాలు ఎక్కు పెడుతున్నారు అని అంటున్నారు. దాని వల్ల జనసైనికులకు చెడ్డ అవడం కాదు కదా వారి మనసు గెలుచుకోవచ్చు అన్నదే ఎత్తుగడ అంటున్నారు.
అలాగే జనసేనలో అసంతృప్తి రేగితే ఆ వర్గం వైసీపీ వైపుగా వస్తే అది తమ పార్టీకే లాభం అన్నదే ఆయన కొత్త ఆలోచన అంటున్నారు. అందుకే పవన్ని పాపం అంటున్నారు. అమాయకుడు అని కూడా అంటున్నారు. మొత్తానికి గుడివాడ నాదెండ్లని టార్గెట్ చేస్తున్నారు. మరి దీని ప్రభావం జనసేనలో ఎలా ఉంటుందో చూడాలని అంటున్నారు.