గుడివాడ వైసీపీకి దూరంగా...సైలెంట్ గా ?

విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా, యువ నాయకుడిగా ఉన్న గుడివాడ పార్టీ ఘోరమైన ఓటమి తరువాత మూడో రోజే మీడియా ముందుకు వచ్చిన వారు.

Update: 2024-08-11 10:18 GMT

గుడ్డు మంత్రిగా సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కి గురి అయిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ వైసీపీకి దూరం పాటిస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన మౌనం పాటిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి ఎపుడూ సందడి చేస్తే ఈ మాజీ మంత్రి మౌనమె నా భాష అంటున్నారు. విశాఖ జిల్లాలో సీనియర్ నేతగా, యువ నాయకుడిగా ఉన్న గుడివాడ పార్టీ ఘోరమైన ఓటమి తరువాత మూడో రోజే మీడియా ముందుకు వచ్చిన వారు.

ఆ తరువాత కూడా ఆహ్య ఆయన కొన్నాళ్ళ పాటు మీడియా ముందు హల్ చల్ చేశారు. కూటమి ప్రభుత్వం మీద కామెంట్స్ కూడా చేశారు. అయితే ఇపుడు ఆయన సైలెంట్ అయిపోయారు. దానికి కారణాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్ధిగా మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పేరుని ప్రకటించడంతోనే గుడివాడ అసంతృప్తి చెందారు అని అంటున్నారు.

ఈ ఎంపిక కూడా విశాఖ జిల్లాకు చెందిన పార్టీ నేతల సమక్షంలోనే జగన్ చర్చలు జరిపి మరీ ప్రకటించారు. ఆనాడు తాడేపల్లికి వెళ్ళిన గుడివాడ ఆ తరువాత నుంచి మాత్రం ఎందుకో సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు.

గుడివాడ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశించారు అని పార్టీలో ప్రచారం ఉంది. ఆయన జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వచ్చారు. 2014 నుంచి 2019 దాకా అయిదేళ్ళ పాటు ఆయన ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అంతే కాదు 2014లో అనకాపల్లి ఎంపీగా 2019, 2024లలో అనకాపల్లి ఎమ్మెల్యే, గాజుగావాక ఎమ్మెల్యే టికెట్లను జగన్ ఇచ్చారు. గతసారి ఆయన గెలిస్తే కీలకమైన అయిదు శాఖలతో మంత్రి పదవిని ఇచ్చారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవి వైసీపీకి కచ్చితంగా దక్కుతుంది అని ఒక టాక్ ఉంది. అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. దాంతో ఎమ్మెల్సీగా గెలిస్తే 2027 డిసెంబర్ దాకా పెద్దల సభలో సభ్యుడిగా మూడేళ్ళకు పైగా ఉండవచ్చు అని విశాఖ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉండవచ్చు అని గుడివాడ భావించారు.

కానీ బొత్సకు ఆ పదవి కట్టబెట్టడంతోనే గుడివాడ అలిగారు అని అంటున్నారు. అయితే విశాఖ జిల్లాకు చెందిన కొందరు నేతలే గుడివాడకు ఆ పదవి ఇవ్వవద్దని జగన్ ని కోరారు అని కూడా ప్రచారం సాగింది. ఇక చూస్తే అధికార టీడీపీ కూటమితో ఫైట్ కాబట్టి సీనియర్ ని బలమైన వారిని బరిలోకి దింపితేనే మేలు అని పార్టీ నేతలతో పాటు జగన్ ఆలోచించి బొత్స పేరుని ఖరారు చేశారు అని అంటున్నారు.

అయితే గుడివాడ మాత్రం విశాఖ జిల్లాకు చెందిన వారికి కాకుండా విజయనగరం జిల్లాకు చెందిన బొత్సను తెచ్చి పెట్టడం మీదనే కాస్తా ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. రేపటి రోజున బొత్స గెలిస్తే విశాఖ జిల్లా రాజకీయాల మీద పట్టు సాధిస్తారని ఆయన ఆధిపత్యంలో పనిచేయలేమని గుడివాడ లాంటి వారు భావించే దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు.

ఏది ఏమైనా గుడివాడ సైలెంట్ మాత్రం వైసీపీలో చర్చగా ఉంది. మరి ఆయన వైసీపీకి కీలకమైన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలసి వస్తారా లేక ఎన్నికలు జరిగేంతవరకూ ఇలాగే ఉంటారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. మరో వైపు గుడివాడకు ఏమైనా వేరే ఆలోచనలు ఉన్నాయా అన్న డౌట్ తో కూడా కొందరు ఆలోచిస్తున్నారుట. చూడాలి మరి ఈ గుడ్డు మంత్రి సైలెన్స్ ని వీడేదెప్పుడో.

Tags:    

Similar News