ఎన్నికల బరిలో గుమ్మడి నర్సయ్య కుమార్తె.. ఏ పార్టీ నుంచి అంటే?
నిలువెత్తు విలువలకు ప్రతీరూపంగా నిలిచే నేతలు ఇప్పటి రోజుల్లో కరువైపోయారు.
నిలువెత్తు విలువలకు ప్రతీరూపంగా నిలిచే నేతలు ఇప్పటి రోజుల్లో కరువైపోయారు. వార్డు మెంబరుగా గెలిస్తే లక్షల్లో ఆదాయం.. సర్పంచ్ గా గెలిస్తే కోట్లాది రూపాయిల్ని వెనకేసుకునే ఈ రోజుల్లో ఎమ్మెల్యేగా పలుమార్లు పని చేసినా.. సరైన ఇల్లు లేకుండా.. సాదాసీదా జీవితంతో ఇది కదా.. అసలుసిసలు రాజకీయ నేత అన్నట్లుగా అనిపించే రాజకీయ నాయకుడు గుమ్మడి నర్సయ్య. తెలుగు రాష్ట్రాల్లో విలువలతో కూడిన రాజకీయాలు.. ధనార్జన కంటే ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా పని చేసే అతి కొద్ది మంది నేతల్లో ఆయన ఒకరు.
తండ్రి ఆదర్శాల్ని.. సిద్ధాంతాల్ని ఒంట పట్టించుకొని.. ఉస్మానియా వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న గుమ్మడి నర్సయ్య కుమార్తె అనురాధ ఇప్పుడు వార్తల్లోకి వచ్చారు. మరికొద్ది వారాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన ఆమె చేస్తున్నారు. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు బరిలో నుంచి దిగుతానని ఆమె చెబుతున్నారు. తాజాగా ఆమె మాట్లాడిన మాటల్ని చూస్తే.. వచ్చే ఎన్నికల్లో తాను ఖాయంగా పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు.
అయితే.. తాను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేయటం లేదని.. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు. అయితే.. ఆమె బీజేపీలో చేరుతుందన్న ప్రచారం జరిగింది.తనను సంప్రదించిన మాట వాస్తవమే కానీ.. తాను ఆ పార్టీ నుంచి పోటీ చేయటం లేదని పేర్కొన్నారు. స్వచ్ఛమైన స్వేచ్ఛా రాజకీయాల కోసం వస్తున్నట్లు చెబుతున్న ఆమె.. రానున్న ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు.
ఒకవేళ మీ తండ్రి ఎన్నికల బరిలో నిలిస్తే.. ఆయన మీద పోటీ చేస్తారా? అని అడిగితే.. తమ మధ్య పోటీ ఉండదని స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో పోటీ చేయటానికి తన తండ్రి స్వాగించారన్న క్లారిటీ ఇచ్చిన అనురాధ.. రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు. మరి.. ఓటర్ దేవుళ్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.