ఎంపీ టికెట్ జేబులో ఉంది.. మీరు కోరితే చివర్లో మారొచ్చన్న మంత్రి జయరాం

తాజాగా తన నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నేతలు.. కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. 2009 నుంచి తన వెంట ఉన్న అందరికి తాను రుణపడి ఉంటానని చెప్పారు.

Update: 2024-01-13 05:22 GMT

ఏపీ కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 175కు 175 లక్ష్యంతో ముందుకు వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి కమ్ వైసీసీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ల కేటాయింపు విషయంలో సంచలన నిర్ణయాల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాను పెట్టుకున్న టార్గెట్ కు రీచ్ కావటమే తప్పించి.. మరెలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా.. గెలుపే ధ్యేయమన్నట్లుగా జగన్ టికెట్ల ప్రకటనలు ఉంటున్నాయి. ఇలాంటి వేళ.. కొందరు కోపతాపాలకు వెళుతుంటే.. మరికొందరు అధినేత నిర్ణయమే తమకు ఫైనల్ అంటున్నారు.

ఇలాంటి వేళ కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. తాజాగా తన నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నేతలు.. కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. 2009 నుంచి తన వెంట ఉన్న అందరికి తాను రుణపడి ఉంటానని చెప్పారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించి.. తర్వాతి కాలంలో వారి ఆశీస్సులతోనే తాను మంత్రిని అయ్యానని వ్యాఖ్యానించారు.

ఇలాంటి వేళ పార్టీ అధినాయకత్వం ఎంపిక చేసినట్లుగా తాను ఎంపీగా ఢిల్లీకి వెళ్లాలా? లేదంటే స్థానికంగా ఉండాలన్నది తన క్యాడర్ గా మీరే ఫైనల్ చేయాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎంపీ టికెట్ జేబులో పెట్టుకొని వచ్చా. మీ ప్రేమాభిమానాలు ఉంటే కచ్ఛితంగా పార్లమెంట్ కు వెళతా. కాదు.. కూడదు ఇక్కడే ఉండాలనుకుంటే ఇంకా టైముంది. బీ పాం చేతికి ఇచ్చిన తర్వాత కూడా వేరే వారికి మార్చిన సందర్భాలు ఉన్నాయి. మీ అందరి కోరిక మేరకు తగ్గట్లుగా సిద్దంగా ఉంటా. ఎంపీగా మీరు వద్దంటే.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తా.. ఇంకా టైముంది. ఆలోచించి చెప్పండి' అంటూ ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ నిర్ణయమే ఫైనల్ అనే దానికి భిన్నంగా క్యాడర్ చెప్పిందే చేస్తానని తేల్చేసిన గుమ్మనూరి జయరాం వ్యాఖ్యలు ఏపీ అధికార పార్టీలో ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News