సెల్ఫీ, రీల్స్ కోసం పోటీ.. కొట్టుకున్న అమ్మాయిలు
సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ తెచ్చుకుని సెలబ్రిటీలుగా మారిపోవాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్న స్టంట్స్ కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది
సామాజిక మాధ్యమాల్లో వ్యూస్ తెచ్చుకుని సెలబ్రిటీలుగా మారిపోవాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తున్న స్టంట్స్ కు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. బహిరంగ ప్రదేశాల్లో రీల్స్ చేసే వాళ్ల సంఖ్య భారీగానే ఉంటోంది. పార్కు అయినా.. రోడ్డు అయినా.. అందంగా కనిపించే ఏ లోకేషన్ అయినా ఫోన్ తీయడం రీల్స్ చేయడం సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం కామన్ గా మారిపోయిందనే చెప్పాలి. తాజాగా ఇలాంటి ఓ అందమైన లోకేషన్ లో రీల్స్ కోసం పోటీ అమ్మాయిల మధ్య గొడవకు దారితీసింది.
గుంటూరులో ఇటీవల కొత్తగా గాంధీ పార్కును ప్రారంభించారు. ఇక్కడ విభిన్న రకాల కళాక్రుతులు ఏర్పాటు చేశారు. కొత్త కళను తీసుకొచ్చారు. ఈ కొత్త పార్కును చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. ఆదివారం సాయంత్రం కూడా భారీ సంఖ్యలోనే జనాలు వచ్చారు. అయితే ఈ సమయంలోనే అమ్మాయిల మధ్య వివాదం మొదలై అది కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది.
ఈ గాంధీ పార్కులోని ఓ ఆకట్టుకునే లోకేషన్ దగ్గర సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు అమ్మాయిలు పోటీపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఫొటోలు, రీల్స్ తీసుకుంటున్నారు. కానీ ఈ క్రమంలో తామంటే తామంటూ పోటీపడ్డారు. దీంతో వివాదం మొదలైంది. మాట మాట పెరిగింది. చివరకు జుట్లు పట్టుకుని ఘోరంగా కొట్టుకునేంత వరకూ ఆ గొడవ వెళ్లింది. వీళ్లను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ అమ్మాయిలు వినిపించుకోలేదు. కొంతసేపటి తర్వాత అందరూ వారించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.