ఏం చేశారని.. దానికి మోదీ పేరు పెట్టాలి?

ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాలేదంటే దానికి కేంద్ర ప్రభుత్వమే కారణమనే విమర్శలు ఉండటమే ఇందుకు కారణం.

Update: 2024-02-06 05:01 GMT

పోలవరం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పడుతున్నాయి. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాలేదంటే దానికి కేంద్ర ప్రభుత్వమే కారణమనే విమర్శలు ఉండటమే ఇందుకు కారణం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ను విభజిస్తున్న సందర్భంగా నాటి కేంద్రంలో కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది నెలలకే దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే పోలవరం ప్రాజెక్టును పట్టించుకున్నది లేదు. 2014 నుంచి 2024 వరకు అంటే వరుసగా పదేళ్లు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయినా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనంటున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఓవైపు ఛత్తీసగఢ్, ఇంకోవైపు ఒడిశా, మరోవైపు తెలంగాణలకు సరిహద్దుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాలను ఒప్పించడంతోపాటు పర్యావరణ అనుమతులు, అటవీ అనుమతులు ఇప్పించడంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అలవిమాలిన నిర్లక్ష్యం చూపింది. ఇక నిధుల విడుదల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఏ ఏడాదికాయేడాది విపరీతంగా పెరుగుతున్నా 2011 నాటి అంచనా వ్యయమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం మెలికపెట్టింది.

పోలవరం నిర్మాణానికి సంబంధించి ఇనుము, సిమెంటు, ఇతర నిర్మాణ సామగ్రి, కూలీల వ్యయం భారీగా పెరిగినప్పటికీ పాత అంచనా వ్యయం మేరకు తాము నిధులు ఇస్తామని కేంద్రం మొండికేయడంతో దాని నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్లాయి. అయితే ఆ నిధులను తిరిగి కేంద్రం రాష్ట్రానికి ఇవ్వడంలోనూ కేంద్రం నిర్లక్ష్యం చూపింది.

ఆంధ్రప్రదేశ్‌ లో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు, 2019 నుంచి అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఎన్నోసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని, అలాగే రాష్ట్రం ఖర్చు పెట్టిన నిధులను రీయింబర్స్‌ చేయాలని కోరితే కానీ పని కావడం లేదు. అది కూడా నిధులను ఒకేసారి కాకుండా అప్పుడు కొంత, అప్పుడు కొంత విడుదల చేయడంతో పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయ్యేవారికి పరిహారం, ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపు తదితర విషయాల్లోనూ కేంద్రం నుంచి ఆశించినంతగా సహాయం లేదు. పోలవరంకు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించినప్పుడే దాని బాధ్యతలన్నీ కేంద్రమే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శీతకన్ను వేసింది.

ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించి దండిగా నిధులు విడుదల చేసినందున దానికి ప్రధానమంత్రి మోదీ సాగునీటి ప్రాజెక్టుగా నామకరణం చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు డిమాండ్‌ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరంపై జరిగిన చర్చలో జీవీఎల్‌ మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నందున ప్రాజెక్టుకు ప్రధాని మోదీ పేరు పెట్టాలని జీవీఎల్‌ విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో జీవీఎల్‌ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఆ సీటుకు బీజేపీలోనే తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ దృష్టిలో పడాలనే జీవీఎల్‌ పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఎత్తుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కసారి కూడా పోలవరంపై మాట్లాడని జీవీఎల్‌ కు ఇప్పుడు ఆ ప్రాజెక్టు గుర్తు వచ్చిందా అని నిలదీస్తున్నారు.

 

Tags:    

Similar News