భీకర యుద్ధం.. ఈ రోజు నుంచే.. ప్రాణాలు పోయిన వారెందరంటే?
ఇజ్రాయెల్ మీద దాడులకు తెగబడ్డ పాలస్తీనా చర్యకు ప్రతిచర్యగా ఈ రోజు (సోమవారం) నుంచి ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్దం జరగనుంది
ఇజ్రాయెల్ మీద దాడులకు తెగబడ్డ పాలస్తీనా చర్యకు ప్రతిచర్యగా ఈ రోజు (సోమవారం) నుంచి ఈ రెండు దేశాల మధ్య భీకర యుద్దం జరగనుంది. అనూహ్య రీతిలో దాడులకు తెగబడిన వేళ.. ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడులకు తెర తీసింది. ఈ రోజు నుంచి ఈ దాడులు మరింత ఎక్కువ అవుతాయన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ మీద పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు (హమాస్) ఏకంగా ఏడు వేల రాకెట్లతో దాడికి దిగగా.. ప్రతిదాడిని ప్రారంభించిన ఇజ్రాయెల్ ఆదివారం నాటికి యుద్ధ తీవ్రతను పెంచింది.
సోమవారం నుంచి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకు జరిగిన పోరులో ఇరు వర్గాలకు చెందిన వెయ్యి మంది మరణించినట్లుగా చెబుతున్నారు. హమస్ చర్యను తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ మంత్రులు.. అధికారులు సోమవారం నుంచి భీకర యుద్ధానికి తమ ఆమోదాన్ని తెలిపారు. సరిహద్దుల్లోని ఖఫర్ అజా.. నహల్ ఓజ్.. అల్యూమిక్.. సాద్ లలో ఉన్న సామాన్యుల్ని సురక్షిత ప్రాంతాలకు వేగంగా తరలిస్తున్నారు.
సరిహద్దుల్లోని పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించటం కూడా యుద్ధ తీవ్రతను పెంచే వ్యూహంలో భాగమేనని చెబుతున్నారు. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో యుద్ధ ట్యాంకులు.. ఫైటర్ జెట్లను మొహరించటం చూస్తే.. సోమవారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలు.. పట్టణాల్లో ఉగ్రవాదుల వేట పెద్ద ఎత్తున సాగుతుందని చెబుతున్నారు.
హమస్ దాడుల్లో తమ పౌరులు.. అధికారులు 700 మంది వరకు మరణించారని.. రెండు వేల మంది వరకు గాయపడినట్లుగా అంచనా వేస్తున్నారు.వీరిలో 200 మంది పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. గాజా స్ట్రిప్టులోని ఒక మసీదు నుంచి ఇజ్రాయెల్ కు భారీ భూగర్భ సొరంగం ఉందన్న విషయాన్ని గుర్తించి.. దాన్ని సైన్యం ధ్వంసం చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రతిదాడితో గాజా వణికిపోతున్నట్లుగా చెబుతున్నారు. గైడెడ్ మిసైల్స్ .. రాకెట్ దాడులతో అక్కడి భవనాలు పేకమేడల్లా కూలిపోతున్నట్లు చెబుతున్నారు.
ఆదివారం మూడు గంటల వరకు 810 లక్ష్యాలపై దాడులు చేయగా.. 13 టవర్ పోలిన భవంతులు.. 30 భారీ భవనాలు.. ఇతర బిల్డింగులు కూల్చేసినట్లుగా చెబుతున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో 400 మంది పౌరులు మరణించినట్లుగా పాలస్తీనా చెబుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ కు వారం రోజులు విమానాల్ని రద్దు చేసినట్లుగా ఎయిరిండియా ప్రకటించింది. ఇప్పటికే విధుల్లో ఉన్న పది మంది ఉద్యోగుల్ని ఇతియోపియా విమానంలో వెనక్కి తీసుకొచ్చారు. మొత్తంగా తాజా యుద్దంతో మరో నరమేధానికి తెర తీసినట్లే.