సున్నితమైన అంశంపై స్పందించిన సినిమా ఇండస్ట్రీ!

ఇజ్రాయేల్ పై హమాస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న హాలీవుడ్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని పిలుపునిచ్చింది

Update: 2023-10-13 04:02 GMT

ఇజ్రాయెల్-హమాస్ భీకర యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వేళ సంఖ్యలో ప్రాణ నష్టం జరగ్గా.. మిలిగిలిన నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయడం కష్టం అని అంటున్నారు. ఇక శనివారం నుంచీ జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో మరణించిన వారి సంఖ్య 2,700కి చేరుకుంది. మరోపక్క గాజాపై ముందుగా చెప్పినట్లుగానే హెచ్చరికలు లేకుండానే ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు చేస్తోంది. గాజాను గజగజ లాడించేస్తోంది. ఈ సమయంలో హాలీవుడ్ స్పందించింది.

అవును... ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత దారుణమైన విషయం, అత్యంత సున్నితమైన విషయం అయిన ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధంపై హాలీవుడ్ స్పందించింది. ఇందులో భాగంగా హమాస్ దాడుల్ని ముక్తకంఠంతో ఖండించింది. ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా కాకుండా... సుమారు 700 మంది సినీ తారలు ఏకతాటిపైకి వచ్చి గళం విప్పారు.

ఇజ్రాయేల్ పై హమాస్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్న హాలీవుడ్.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు "క్రియేటివ్‌ కమ్యూనిటీ ఫర్‌ పీస్‌" సంస్థ రాసిన లేఖపై 700కుపైగా సినీ తారలు సంతకాలు చేశారు. ఇలా సంతకాలు చేసినవారిలో అతిచిన్న నటుడి నుంచి ఆస్కార్ అవార్డ్ గ్రహీతలూ ఉన్నారని అంటున్నారు.

ఇలా ఆల్ మోస్ట్ హాలీవుడ్ మొత్తం ఏకతాటిపైకి వచ్చి సంతకాలు చేసిన లేఖలో కీలక విషయాలు, సుటిగా ప్రస్తావించారు. ఇందులో భాగంగా... "హమాస్‌ కు చెందిన వ్యక్తులు అమాయక ప్రజల్ని హత్య చేశారు.. చిన్న పిల్లల్ని, పెద్దల్ని అపహరించి దారుణంగా చంపేశారు.. ఇది ఉగ్రవాదం.. రాక్షసత్వం" అని అభిప్రాయపడింది హాలీవుడ్.

ఇదే సమయంలో... "హమాస్‌ చర్యలు ఎవరూ సమర్థించలేనివి.. ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలి.. సినిమా రంగంలోని అందరూ ఇజ్రాయెల్‌ కు మద్దతుగా నిలవాలి".. అని కోరింది. ఇదే క్రమంలో... "ఏమాత్రం అవకాశం ఉన్నా, ఎవరికి ఆ ఛాన్స్ ఉన్నా, సాధ్యమైతే ఉగ్రవాద సంస్థతో మాట్లాడి బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు ప్రయత్నించాలి".. అని లేఖలో పేర్కొన్నారు.

ఇక ఈ బహిరంగ లేఖపై టాప్ 10 హాలీవుడ్ స్టార్స్ సహా 700కిపైగా సినీ తారలు సంతకాలు చేశారు. అయితే... ఇప్పటికే చాలా మంది తారలు వ్యక్తిగతంగా సోషల్‌ మీడియా వేదికగా హమాస్‌ దాడుల్ని ఖండించి.. ఇజ్రాయెల్‌ కు మద్దతు తెలిపినప్పటికీ.. వందల మంది తారలు కలిసి ఏకతాటిపైకి వచ్చి ఇలా ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీంతో హాలీవుడ్ ఇండస్ట్రీని, సినీ తారలను పలువురు అభినందిస్తున్నారు. విషయం ఏదైనా, ఎవరికి మద్దతిస్తున్నారు, ఎవరితో విభేదిస్తున్నారనే విషయం మరేదైనా... అంత పెద్ద ఇండస్ట్రీ ఇలా ఏకతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం గొప్ప విషయమని అంటున్నారు విమర్శకులు!

ఇలా సంతకాలు చేసిన స్టార్స్ లో గాల్ గాడోట్, జామీ లీ కర్టిస్, మయిమ్ బియాలిక్, లీవ్ ష్రైబర్, క్రిస్ పైన్, అమీ షుమెర్, మైఖేల్ డగ్లస్, డెబ్రా మెస్సింగ్, జెర్రీ సీన్‌ ఫెల్డ్, గ్రెగ్ బెర్లాంటి, హైమ్ సబాన్, ఇర్వింగ్ అజోఫ్, యినాన్ క్రీజ్, మార్క్ హమిల్, హోవీ మాండెల్, బెల్లా థోర్న్, ఆంటోయిన్ ఫుక్వా మొదలైన సెలబ్రిటీలు సంతకాలు చేశారు.

Tags:    

Similar News