హన్సికపై వేధింపుల కేసు.. పోలీసులకు ఆడపడుచు ఫిర్యాదు
ఒకప్పుడు వెండితెరను ఏలేసి.. కోట్లాది కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన నటి హన్సికపై వేధింపుల కేసును పోలీసులు నమోదు చేశారు.
ఒకప్పుడు వెండితెరను ఏలేసి.. కోట్లాది కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన నటి హన్సికపై వేధింపుల కేసును పోలీసులు నమోదు చేశారు. ఆమె ఆడపడుచు తాజాగా హన్సికపై సంచలన ఆరోపణలు చేశారు. బుల్లితెర నటిగా సుపరిచితురాలైన ముస్కాన్ నాన్సీ తాజాగా పోలీసుల్ని ఆశ్రయించారు. తన భర్త ప్రశాంత్.. అత్త జ్యోతి.. ఆడపడుచు హన్సికలు తనను తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేస్తున్నట్లుగా పేర్కొంది.
ఈ ఒత్తిడి కారణంగా తన ముఖానికి పాక్షికంగా పక్షవాతానికి గురైనట్లుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంచలన అంశం ఏమంటే.. ఈ కంప్లైంట్ ను ముంబయి పోలీసులు పరిశీలించి.. చివరకు గృహ హింస కేసును నమోదు చేశారు. అయితే.. ఈ కేసు అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ పెళ్లి 2020లో జరిగిందని.. పెళ్లైన కొంతకాలానికే డబ్బులు.. విలువైన బహుమతులు కావాలని అత్త.. ఆడపడుచు హన్సికలు డిమాండ్ చేసినట్లుగా పేర్కొంది.
ఆస్తిలోనూ కుట్రలకు పాల్పడినట్లుగా ఆరోపించింది. అంతేకాదు.. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదే పదే జోక్యం చేసుకునేదని.. ఈ కారణంగా తమ మథ్య గొడవలు జరిగేందుకు కారణమైందని పేర్కొన్నారు. వీరంతా కలిసి తనకు పెట్టిన టార్చర్ కారణంగా తన ముఖానికి పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులు వెల్లడించారు.
ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తుండగా.. భర్త ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్న్లట్లుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలోనూ ఒక పోస్టు పెట్టారు. ‘‘జీవితంలో కొన్నిసార్లు ఎప్పుడేం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేను ఏమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధ పడుతున్నా. అధిక ఒత్తిడితో నాకీ పరిస్థితి వచ్చింది. గతంలోనూ ఈ వ్యాధి బారిన పడగా.. అప్పుడు కోలుకున్నా. ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి బారిన పడ్డా’’ అంటూ పోస్టు పెట్టారు. ఇదిప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నటి హన్సిక ఇప్పటివరకు స్పందించలేదు.