కజిన్ చేతిలో మోసపోయిన హార్దిక్ పాండ్యా బ్రదర్స్!
వివరాళ్లోకి వెళ్తే... హార్దిక్ – కృనాల్ లు.. వారి కజిన్ వైభవ్ తో కలిసి 2021లో సంయుక్తంగా పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించారట.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ 17 సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబై కెప్టెన్ గా రోహిత్ ని తప్పించి పాండ్యాకు ఇవ్వడంతో అతడి పేరు మరింత వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లోనూ రోహిత్ ఫ్యాన్స్.. పాండ్యాను టార్గెట్ చేస్తున్న అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సమయంలో తాజాగా హార్దిక్ పాండ్యాతో పాటు కృనాల్ పాండ్యా పేర్లు తాజా మరో విషయంలో తెరపైకి వచ్చాయి.
అవును... క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు తమ సమీప బంధువు చేతిలోనే మోసపోయారని తెలుస్తుంది. వరుసకు సోదరుడయ్యే వైభవ్ పాండ్య అనే వ్యక్తి... వీరికి పార్ట్ నర్ షిప్ బిజినెస్ లో సుమారు రూ.4.3కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టాడని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారంపై హార్దిక్ - కృనాల్ లు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీంతో... ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం అధికారులు వైభవ్ ను అరెస్టు చేశారని సమాచారం!
వివరాళ్లోకి వెళ్తే... హార్దిక్ – కృనాల్ లు.. వారి కజిన్ వైభవ్ తో కలిసి 2021లో సంయుక్తంగా పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించారట. దీనిలో హార్దిక్, కృనాల్ కు 40శాతం చొప్పున పెట్టుబడులుండగా.. మిగతా 20శాతం వాటా వైభవ్ పేరున ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... వైభవ్ ఈ బిజినెస్ రోజువారీ కార్యకలాపాలను చూసుకుంటూ.. వచ్చే లాభాలను కూడా ఇదే నిష్పత్తిలో పంచుకున్నారని చెబుతున్నారు.
అయితే.. హార్దిక్, కృనాల్ కి తెలియకుండా కొద్ది రోజుల క్రితం వైభవ్ సొంతంగా మరో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించాడని.. దీంతో గతంలో భాగస్వామ్యంతో పెట్టిన బిజినెస్ కు లాభాలు తగ్గి రూ.3కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలుస్తుంది. అదే సమయంలో వైభవ్ రహస్యంగా తన లాభాల వాటాను 20శాతం నుంచి 33 శాతానికి పెంచుకున్నాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. సుమారు రూ.4.3కోట్ల మేర హార్దిక్ సోదరులను మోసగించాడనేది కేసు!
ఈ విషయంపై హార్దిక్, కృనాల్ లు అడగా... పరువు తీస్తానంటూ బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో.. హార్దిక్, కృనాల్ లు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న ముంబయి పోలీసులు బుధవారం వైభవ్ ను అరెస్టు చేశారు. దీనిపై తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.