'అభివృద్ధి అంటే అది కాదు'... లోకల్ లీడర్స్ పై జోగయ్య లేఖాస్త్రం!

అవును... పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు.. నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య తాజాగా ఓ బహిరంగ లేఖ రాశారు.

Update: 2024-12-19 14:32 GMT

ఏపీ రాజకీయాల్లో హరిరామ జోగయ్య లేఖలకు ఓ ప్రత్యేక స్థానం ఉందని అంటారు. వాటిని ఎవరికి రాశారో వారు ఎంతవరకూ స్పందింస్తారనే సంగతి కాసేపు పక్కనపెడితే.. అటు మీడియాలోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ మాత్రం హల్ చల్ చేస్తుంటాయని అంటారు! ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కం మంత్రికి తాజాగా ఓ లేఖ రాశారు జోగయ్య.

అవును... పాలకొల్లు ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు.. నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు మాజీ మంత్రి, కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షులు హరిరామ జోగయ్య తాజాగా ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా.. అభివృద్ధి అంటే ఏమిటో వెల్లడిస్తు.. బాధ్యతలను గుర్తు చేస్తూ.. సూచనలు చేస్తూ.. పలు డిమాండ్లు తెరపైకి తెచ్చారు.

ఇందులో భాగంగా... అభివృద్ధి అంటే రాజ్య సాధనాలు, నివాస భవనాలు, పరిపాలనా భవనాలు, కళా భవనాలు, విశ్రాంతి భవనాలు, పార్కులు నిర్మించడం కాదని.. రోడ్లు, స్వచ్ఛమైన త్రాగునీరు, సాగునీరు, మురుగు కాల్వల నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణతో పాటు అందుబాటులో వైద్య సౌకర్యం కల్పించడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు.

అయితే... రాజ్య భవనాల పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే ఈ ప్రభుత్వానికి ప్రాధ్యానతగా కనబడుతుందని అన్నారు. ఇదే సమయంలో.. అభివృద్ధి అంతటినీ కేంద్రీకరిస్తూ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ కోట్లాది రుపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని జోగయ్య విమర్శించారు!

ఇది ఏమాత్రం నిజమైన రాష్ట్రాభివృద్ధి అనిపించుకోదని స్పష్టం చేశారు! రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలనేదే ప్రభుత్వ లక్ష్యం కావాలని తెలిపారు. ఇక.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, ఆచంట, భీమవరంతో పాటు తూర్పూ గోదావరిలోని రాజోలు కు సమాన దూరంలో ఉన్న పాలకొల్లులో ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఎవరికైనా, ఏమైనా చిన్నా, పెద్ద వైద్య అవసరం వస్తే.. అటు హైదరాబాద్, ఇటు విశాఖ వెళ్లాల్సిన అవసరం వస్తుందని.. అటువంటి అవస్థల నుంచి బయటపడటం కోసం ప్రతి జిల్లాకి "ఆరోగ్య శ్రీ" కలిగిన సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మించాల్సిన ప్రాధాన్యత ఎంతైనా ఉందని అన్నారు.

ఈ నేపథ్యంలో పాలకొల్లు పట్టణంలో 100 పడకల ఆస్పత్రి సాంక్షన్ కాబడి నిర్మాణ దశలో ఉందని.. ఇదే సమయంలో మెడికల్ కాలేజీ కూడా సాంక్షన్ కాబడి నిర్మాణ దశలో ఉందని.. నిర్మాణానికి అవసరమైన 13.5 ఎకరాల స్థలం కూడా అందుబాటులో ఉందని.. ఈ నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలో 500 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ స్థాపించడం చాలా అవసరమని అన్నారు.

ఈ నేపథ్యంలో... దీనికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా పాలకొల్లు ఎమ్మెల్యే కమ్ మంత్రి నిమ్మల రామానాయుడు, నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మను ప్రజల తరుపున కోరుతున్నట్లు హరిరామ జోగయ్య తన లేఖ ద్వారా వెల్లడించారు.

Tags:    

Similar News