పవన్ కు జోగయ్య వార్నింగ్... తెరపైకి విలీనం మాటలు!

అవును... టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తు అంశం చర్చనీయాంశం అవుతున్న సమయంలో ఒక న్యూస్ మీడియాలో హల్ చల్ చేసింది.

Update: 2024-03-12 04:38 GMT

ఏపీలో సరికొత్త పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలతో టీడీపీ.. 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలతో జనసేన.. 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలతో బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా పవన్ ఎంపీగా పోటీ చేస్తారని ఒక వార్త హల్ చల్ చేసింది. దీంతో.. జోగయ్య లైన్ లోకి వచ్చారు.

అవును... టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తు అంశం చర్చనీయాంశం అవుతున్న సమయంలో ఒక న్యూస్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే అది వ్యూహాత్మకంగా విడుదలైన లీక్ అనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని.. అనంతరం బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తారని.. బీజేపీ పెద్దలపై తనకున్న నమ్మకంతో అందుకు పవన్ సానుకూలంగా స్పందించారని ఆ వార్తల సారాంశం.

పైగా... ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం అనంతరం.. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్రమంత్రిగా పని చేశారు చిరంజీవి. ఇదే క్రమంలో మోడీ కేబినెట్ లో పవన్ కల్యాణ్ కు కూడా అలాంటి అవకాశం ఇవ్వాలని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని అంటున్నారు. దీంతో ఒకసరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... లోక్ సభ కు పవన్ అనే అంశం చంద్రబాబు పన్నాగం లో భాగమని కాపు సమాజికవర్గంలో ఒక బలమైన చర్చ నడుస్తుందని తెలుస్తుంది.

పవన్ కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం వల్ల రాష్ట్ర రాజకీయాలకు వీలైనంత దూరం అవుతారని.. ఫలితంగా తన కుమారుడు లోకేష్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని బాబు ప్లాన్ చేశారని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో పవన్ కు బ్రెయిన్ వాష్ చేయడానికి బీజేపీ నాయకులను చంద్రబాబు ప్రభావితం చేసి ఉండొచ్చనే అభిప్రాయాలూ తెరపైకి వస్తున్నాయి.

ఈ సమయంలో ఎంటరైన హరిరామ జోగయ్య... లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఆ ఆలోచన విరించుకోవాలని పవన్ కు సూచించారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఇందులో భాగంగా.. రాష్ట్రాన్ని పాలించిన అనుభవం, రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం కావాలనుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయాలని పవన్ కు హరిరామ జోగయ్య సూచించారు. పైగా పవన్ అసెంబ్లీకి పోటీ చేయడం ఎంత అవసరం అనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలో కాపు ప్రాతినిధ్యం బలంగా లేకపోతే.. అది రాష్ట్ర రాజకీయాల్లో కమ్మ, రెడ్డి ల ఆధిపత్యానికి దారితీస్తుందని.. కాపులు, ఇతర బలహీనవర్గాల పాత్ర ఉండదని హరిరామ జోగయ్య హెచ్చరించారు. ఇదే సమయంలో గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... రాష్ట్ర అసెంబ్లీలో పవన్ కల్యాణ్ కు ప్రాతినిధ్యం లేకపోతే... నారా లోకేష్ కోసం జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే ప్రచారం పెరిగిపోయే ప్రమాదం ఉందని జోగయ్య హెచ్చరించారు! దీంతో... ఇప్పుడు ఈ హెచ్చరికలు పవన్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారనే విషయం కాసేపు పక్కనపెడితే... కాపు సామాజికవర్గంలో మాత్రం పవన్ వైఖరిపై తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News