పవన్ చెవిలో జోగయ్య...ఏమవుతుంది...!?
సీఎం సీటు షేర్ చేసుకోమని సూచించారు. అంతే కాదు కచ్చితంగా అరవై దాకా సీట్లను డిమాండ్ చేయమని కోరారు
చెవిలో జోరిగ మాదిరి అని ఒక ముతక సామెత ఉంది. పాపం పెద్దాయన హరి రామజోగయ్య అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెవిలో జోరిగ మాదిరిగా పోరు పెడుతున్నారు. పవన్ సీఎం కావాలని ఆయన కోరుకుంటున్నారు. వయోభారాన్ని లెక్క చేయకుండా ఆయన రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళి పవన్ ని కలసి వచ్చారు.
సీఎం సీటు షేర్ చేసుకోమని సూచించారు. అంతే కాదు కచ్చితంగా అరవై దాకా సీట్లను డిమాండ్ చేయమని కోరారు. అయితే పవన్ ఆయనతో చెప్పినది కూడా తాజాగా ఆయన చెప్పేశారు. ఈ మేరకు పవన్ కి మరోసారి లేఖ రాస్తూ జోగయ్య పవన్ నలభై దాకా సీట్లకు డిమాండ్ చేస్తారని తెలిసిందని కానీ అరవై దాకా సీట్లు జనసేన కోరితే బాగుంటుంది అని అంటున్నారు.
అంతే కాదు రెండున్నరేళ్ల పాటు పవన్ సీఎం అన్నది కూడా పొత్తు ఒప్పందంగా ఉండాలని కూడా జోగయ్య సూచించారు. పవన్ కచ్చితంగా సీఎం పదవి చేపట్టాలని జోగయ్య అంటున్నారు. కాపులకు అదే అసలైన కోరిక అని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
జనసేన టీడీపీ గెలిచే విధానం కూడా ఆయన చెప్పారు. పవన్ సీఎం అవుతారు అన్నది కూడా జనంలో ఉంచితేనే టీడీపీ జనసేన ఓటింగ్ బదిలీ అవుతుందని కూడా రాజకీయాల్లో తలపండిన జోగయ్య అంటున్నారు. ఇక పవన్ వచ్చే ఎన్నికల్లో భీమవరం నర్సాపురం, తాడేపల్లిగూడెం లలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకుని పోటీ చేయాలని కూడా జోగయ్య సూచించడం విశేషం. మొత్తానికి చూస్తే పవన్ కళ్యాణ్ సీఎం అని జోగయ్య గట్టిగానే పోరుతున్నారు. మరి జనసేన అధినేత ఏ రకంగా దీన్ని తీసుకుంటారో చూడాల్సి ఉందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ వరకూ చూస్తే పొత్తు ధర్మానికి భంగం కలిగించకుండా రెండు పార్టీలు కలసి ముందుకు సాగాలన్నదే విధానంగా ఉంది అని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూడాలని పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడం ఒక ఆలోచన అయితే గెలిచే సీట్లను కోరుకోవడం కూడా మరో ఆలోచన అని అంటున్నారు. ఏది ఏమైనా మంచి నంబర్ తో 2024 తరువాత అసెంబ్లీలో ప్రవేశించాలన్నది పవన్ ఆలోచన అని అంటున్నారు.